
కంబాలకొండలో నిలిచిపోయిన బోటింగ్
ఆరిలోవ: ప్రముఖ పర్యాటక కేంద్రం కంబాలకొండ ఎకోటూరిజం పార్కు ఇప్పుడు కళ తప్పింది. పర్యాటకులకు ఎంతో ఆనందాన్నిచ్చే బోటింగ్ సౌకర్యం నిలిచిపోవడంతో సందర్శకులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. సాధారణంగా దట్టమైన కొండల నుంచి వచ్చే వర్షపు నీటితో నిండి ఉండే డేగల గెడ్డగా పిలవబడే ఈ కొలను.. ఈ ఏడాది సరిపడినంత వర్షాలు లేకపోవడంతో పూర్తిగా అడుగంటిపోయింది. అడుగు భాగంలో అక్కడక్కడ మట్టి దిబ్బలు స్పష్టంగా కనిపిస్తుండటంతో బోటింగ్‌కు వీలుపడటం లేదు. దీంతో పార్కులో ఉన్న కయాక్స్, ఫ్యామిలీ బోట్లు, ఇతర బోట్లు అన్నీ ఒడ్డుకే పరిమితమయ్యాయి. దాదాపు మూడు నెలల నుంచి పర్యాటకులు ఇక్కడ బోటింగ్ చేసే అవకాశం కోల్పోయారు. గతంలో ఆగస్టు నెలలో ఈ కొలను నిండి ప్రవహించేది. అయితే ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో కొలనులో నీరు చేరలేదు.