
నిబద్ధతకు నిలువెత్తు రూపం సత్యప్రసాద్
హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్ రావు
విశాఖ లీగల్: న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రతిభావంతులైన న్యాయవాదులు ఎంతైనా అవసరమని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. విశాఖలో నూతన న్యాయస్థాన సముదాయంలోని న్యాయవాదుల సంఘం భవనంలో శనివారం దివంగత సీనియర్ న్యాయవాది ఎస్వీ సత్యప్రసాద్ చిత్రపట ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన న్యాయమూర్తులు ప్రసంగించారు. ముందుగా సత్యప్రసాద్ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్ రావు మాట్లాడుతూ సత్యప్రసాద్ నిబద్ధతకు నిలువెత్తు రూపమని కొనియాడారు. మరో న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ మాట్లాడుతూ సత్యప్రసాద్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. జస్టిస్ చల్లా కోదండరామయ్య , జస్టిస్ చీమలపాటి రవి... సత్యప్రసాద్‌తో ఉన్న అనుబంధాలను పంచుకున్నారు. కార్యక్రమంలో పూర్వ న్యాయమూర్తి జస్టిస్ డి.వి.ఎస్.ఎస్. సోమయాజులు, రాష్ట్ర బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు ఎస్. కృష్ణమోహన్, విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు, న్యాయవాదుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎం.కె. శ్రీనివాస్, లాలం పార్వతీనాయుడు, సీనియర్ న్యాయవాదులు నమ్మి సన్యాసిరావు, రామదాసు, శిష్ట్లా శ్రీనివాసమూర్తి, కె.వి.రామ్మూర్తి, శివరాం, మీనాక్షి రవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యప్రసాద్ కుటుంబ సభ్యులు విశాఖ న్యాయవాద సంఘం నూతన భవనానికి ఐదు లక్షల రూపాయల విలువ చేసే యంత్రాలను విరాళంగా అందించారు.