
నేత్రపర్వంగా అనంతుని జయంతి
పద్మనాభం: శ్రీ కుంతీ మాధవ స్వామి ఆలయంలో శనివారం అనంత పద్మనాభ స్వామి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కుంతీ మాధవ స్వామి ఆలయంలో కొలువై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత అనంత పద్మనాభ స్వామి ఉత్సవ విగ్రహాలను అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్దకు పల్లకీలో తీసుకువచ్చి అధిష్టింపజేశారు. అలాగే శ్రీదేవి భూదేవి సమేత అనంత పద్మనాభ స్వామి చిన్న ఉత్సవ విగ్రహాలను పల్లకీలో కొండపైకి తీసుకువెళ్లారు. ఉదయం 7 గంటలు, 10.30 గంటలకు జరిగిన వ్రతాల్లో మొత్తం 160 మంది దంపతులు పాల్గొన్నారు. కొండపై ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయంలో పంచామృత అభిషేకాలు కూడా నిర్వహించారు. కొండ కింద ఉన్న కుంతీ మాధవ స్వామి, కొండపై ఉన్న అనంత పద్మనాభ స్వామి ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వేడుకల్లో ఎంపీపీ కంటుబోతు రాంబాబు, సర్పంచ్ తాలాడ పాప, పద్మనాభంతో పాటు విశాఖపట్నం, సింహాచలం, విజయనగరం వంటి దూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి.. అనంత పద్మనాభ స్వామిని కనులారా వీక్షించారు.