
బోణీ కొట్టిన బుల్స్, జెయింట్స్
విశాఖ స్పోర్ట్స్: నగరంలోని పోర్టు స్టేడియం కబడ్డీ.. కబడ్డీ నామస్మరణతో మార్మోగిపోతోంది. ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్ స్థానిక క్రీడాభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. శనివారం జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లు ప్రేక్షకులను అలరించాయి. బెంగళూరు బుల్స్, గుజరాత్ జెయింట్స్ అద్భుత విజయాలు సాధించి పాయింట్ల ఖాతా తెరిచాయి. తొలి మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 38–30 తేడాతో పాట్నా పైరేట్స్‌ను కంగుతినిపించింది. ఇరుజట్లు నువ్వానేనా అన్నట్టు తలపడటంతో మ్యాచ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. బుల్స్ తరఫున అలీరెజా (10), ఆశిష్ (8) రైడింగ్‌లో అదరగొట్టగా, పాట్నా రైడర్ అయాన్ (10) పోరాడినా ఫలితం దక్కలేదు. మరో ఉత్కంఠభరిత పోరులో గుజరాత్ జెయింట్స్ 37–28తో తమిళ్ తలైవాస్‌పై గెలుపొందింది. జెయింట్స్ ఆటగాళ్లు సమష్టిగా రాణించి విజయాన్ని అందుకున్నారు. ఆల్ రౌండర్ నితిన్ పన్వర్ (8), కెప్టెన్ షాదులు (6) కీలక పాయింట్లతో జట్టును విజయపథాన నడిపించారు. ఆదివారం బెంగాల్ వారియర్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడనుంది. మరో మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీ, జైపూర్ పింక్ పాంథర్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.