● అభివృద్ధి కార్యక్రమాలు జరగనీయకుండా అడ్డుకట్ట ● 69వ వార్డులో నిలిచిన అభివృద్ధి పనులు ● పనులు మొదలుపెట్టాలంటూ స్థానికుల నుంచి వినతులు ● గ్రీవెన్స్‌లో కమిషనర్‌కు ఒకే రోజు 30 మంది ఫిర్యాదుల అందజేత ● తాను హాజరుకాకుండా పనులు మొదలుపెట్టకూడదని పల్లా ఆదేశం?
విశాఖ సిటీ : సొంత పార్టీ కార్పొరేటర్ వార్డులో ఒక్క అభివృద్ధి పని కూడా జరగనీయకుండా ఏకంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అడ్డుకుంటున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఏకంగా రూ.7 కోట్ల విలువ చేసే వివిధ పనులకు శంకుస్థాపన జరగనీయకుండా పల్లా అడ్డుకుంటున్నారనే విమర్శలున్నాయి. 69వ వార్డులో ఇప్పటికే వర్క్ ఆర్డర్లు ఇచ్చిన పనులు కూడా ప్రారంభం కాని దుస్థితి నెలకొంది. సోమవారం వార్డుకు చెందిన 30 మంది తమ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదంటూ జీవీఎంసీలో జరిగిన పీజీఆర్‌ఎస్‌లో నేరుగా కమిషనర్ కేతన్ గార్గ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. తమ వార్డులో రోడ్డు వేయడం లేదని ఒకరు.. డ్రైనేజీ నిర్మించడం లేదని మరొకరు ఇలా పలు సమస్యలపై తుంగలాం రెడ్డి వేమన సంక్షేమ సేవా సంఘం, ఉప్పాడ రామచంద్రరావు, గ్రామాభివృద్ధి యువజన సేవా సంఘం, కొల్లి కంచురావు ఇలా ఏకంగా 30 మంది వ్యక్తులు, సంఘాలు వచ్చి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమవుతోంది.
శంకుస్థాపనలకు
ససేమిరా...!
వాస్తవానికి 69వ వార్డు కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డికి పల్లాకు మధ్య మొదటి నుంచి వివాదాలు నడుస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో కాకి గోవిందరెడ్డి సహకరించలేదంటూ పల్లా ఇప్పటికే పార్టీకి ఫిర్యాదులు కూడా చేశారు. మొన్న జరిగిన మేయర్ ఎన్నికల్లో మాత్రం పార్టీ తరపునే ఉండాలంటూ కాకి గోవిందరెడ్డిని పల్లా స్వయంగా బతిమాలాడారు. అంతేకాకుండా కలిసి పనిచేద్దామని కూడా చెప్పినట్టు తెలుస్తోంది. తీరా మేయర్ ఎన్నిక ముగిసిన తర్వాత కాకి గోవిందరెడ్డి వార్డులో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టాలన్నా స్థానిక ఎమ్మెల్యే తనకు తెలియజేయాలంటూ జీవీఎంసీ అధికారులకు పల్లా హుకుం జారీచేసినట్టు ప్రచారం జరుగుతోంది. తాను హాజరుకాకుండా ఎటువంటి పనులు ప్రారంభించకూడదని గట్టిగానే చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో 69వ వార్డులో ఇప్పటివరకు పలు పనుల కోసం టెండర్లను పిలిచి.. వర్క్ ఆర్డర్లు కూడా కాంట్రాక్టర్లకు ఇచ్చినప్పటికీ పనులు మాత్రం ప్రారంభం కావడం లేదు. ఎందుకంటే ఈ పనుల శంకుస్థాపనలకు హాజరయ్యేందుకు ఏ తేదీ కూడా పల్లా ఇవ్వడం లేదు. దీంతో పనులన్నీ ప్రారంభం కాకుండానే నిలిచిపోయాయి. అధికారపార్టీ నేతలు ఇద్దరు గొడవపడుతూ.. తమను ఎందుకు ఇబ్బందులు పెడతారంటూ స్థానిక వార్డుకు చెందిన ప్రజలు వాపోతున్నారు.