
రిజిస్ట్రేషన్ ప్రక్రియలోనే ఆస్తి పన్ను పేరు మార్పు
● ఆగస్టు 1 నుంచి ప్రక్రియ ప్రారంభం ● ఆస్తి పన్ను పేరు మార్పుకై జీవీఎంసీకి దరఖాస్తు చేయక్కర్లేదు ● అదనపు కమిషనర్ రమణమూర్తి
డాబాగార్డెన్స్: రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్ జరిగే ప్రక్రియలోనే ఆస్తి పన్ను పేరు మార్చే విధానాన్ని ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం కల్పించిందని జీవీఎంసీ అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి వెల్లడించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే ఇక నుంచి ఆస్తి పన్ను పేరు మార్పు చేసేలా విధి విధానాలపై రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డీఐజీ జి.బాలకృష్ణ, జీవీఎంసీ డీసీఆర్ శ్రీనివాసరావుతో కలిసి సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవీఎంసీ పరిధిలో భూములు, భవనాలు, అపార్ట్‌మెంట్ల కొనుగోలు ప్రక్రియలో భాగంగా ఇక నుంచి సంబంధిత రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోని జీవీఎంసీ అసెస్‌మెంట్ కలిగిన ఆస్తులకు ఆస్తి పన్ను పేరు మార్పు ఆటోమేటిక్‌గా జరిపే అవకాశాన్ని కల్పించినట్లు పేర్కొన్నారు. ఇక మీదట సంబంధిత ఆస్తుల రిజిస్ట్రేషన్ అనంతరం జీవీఎంసీ కార్యాలయానికి రాకుండానే ఇంటి పన్ను పేరు మార్పు జరిగి పోతుందన్నారు. ఈ ప్రక్రియ ఆగస్టు 1 నుంచి జీవీఎంసీ పరిధిలో అమలుకానుందన్నారు. ఇందుకు ఆస్తుల కొనుగోలు సమయంలోనే సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆస్తి పన్ను పేరు మార్పునకు సంబంధించి జీవీఎంసీకి చెల్లించాల్సిన మ్యూటేషన్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే జీవీఎంసీ రికార్డుల్లో ఆటోమేటిక్‌గా ఆస్తి యజమాని పేరు, ఆస్తిపన్ను పేరు మారిపోతుందన్నారు. దీనిపై జీవీఎంసీ రెవెన్యూ విభాగం, రిజిస్ట్రేషన్ కార్యాలయాల అధికారులు, ఉద్యోగులకు అవగాహన కల్పించాలని తెలిపారు.