
ప్రతి సమస్యకు నాణ్యమైన పరిష్కారం
● రెవెన్యూ శాఖమంత్రి సత్యప్రసాద్ ● పీజీఆర్‌ఎస్‌కు 427 వినతులు
మహారాణిపేట: ప్రజాసమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ప్రతి సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా అధికారులను రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. విశాఖ, తిరుపతి జిల్లాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక చాలా బాగా జరుగుతోందని, సమస్యల పరిష్కారంలో కూడా సానుకూలత ఉందని పేర్కొన్నారు. ఇక్కడ అవలంబిస్తున్న విధానాలను అధ్యయనం చేసి మిగిలిన చోట్ల అమలు చేసేందుకు స్వయంగా పీజీఆర్‌ఎస్‌లో పాల్గొంటున్నానని స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్‌లో స్వయంగా మంత్రి సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్ నిర్వహణ, సమస్యల పరిష్కారంలో ప్రజల నుంచి సానుకూల అభిప్రాయం (పాజిటివ్ పర్సెప్షన్) నమోదవుతోందని గుర్తు చేశారు. యోగాంధ్ర నిర్వహణలో అధికార యంత్రాంగం అభినందనీయ పాత్ర పోషించి, గిన్నీస్ రికార్డుతో పాటు మరో 22 రికార్డులు సాధించిందని ఆయన కొనియాడారు. అనంతరం జిల్లాలో పీజీఆర్‌ఎస్ నిర్వహణ, అధికారుల పనితీరు, ఇతర అంశాలను కలెక్టర్ హేరందిర ప్రసాద్ వివరించారు. వారం వారం ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై నిర్ణీత సమయంలో ఎండార్స్‌మెంట్ ఇస్తూ పరిష్కరిస్తున్నామని, క్రమం తప్పకుండా ఆడిట్ నిర్వహిస్తూ నాణ్యమైన పరిష్కారం చూపుతున్నామని ఆయన తెలిపారు.
427 వినతుల స్వీకరణ
వివిధ సమస్యలపై మొత్తం 427 వినతులు అందినట్లు అధికారులు తెలిపారు. వీటిలో అత్యధికంగా రెవెన్యూ విభాగానికి చెందినవి 180, జీవీఎంసీకి 54, పోలీసు శాఖకు 23, ఇతర విభాగాలకు చెందినవి 170 ఫిర్యాదులు ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి ప్రభుత్వ, ప్రైవేటు భూ ఆక్రమణలు, వ్యక్తిగత కార్యకలాపాలకు అడ్డంకిగా నిలుస్తున్న రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఫిర్యాదులు సమర్పించారు.