
నేడు రెండో విడత చందనం సమర్పణ
సింహాచలం: వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి సోమవారం రెండవ విడత చందనం సమర్పణను శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు దేవస్థానం వైదికులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే సిద్ధం చేసిన మూడు మణుగుల పచ్చి చందనంలో ఆదివారం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు ఇరగవరపు రమణాచార్యులు, పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు, వైదికులు సుగంధ ద్రవ్యాలను కలిపారు. సోమవారం తెల్లవారుజామున స్వామికి సుప్రభాత సేవ అనంతరం చందనాన్ని సమర్పించనున్నారు. ఏఈవో ఆనంద్‌కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
పెద్ద ఎత్తున చేరుకున్న భక్తులు
సింహాచలం క్షేత్రంలో సోమవారం వైశాఖ పౌర్ణమి ఉత్సవం కావడంతో ఆదివారం సాయంత్రానికే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల భక్తులు, మత్స్యకారులు తరలివచ్చారు. వీరంతా సోమవారం కొండదిగువ వరాహ పుష్కరిణిలో స్నానాలు ఆచరించి కొండపై వెళ్లి స్వామిని దర్శించుకుంటారు. కోలలకు పూజలు చేసి.. సహపంక్తి భోజనాలు చేస్తారు. భక్తులతో అడవివరం పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది.