
రాజకీయ ప్రయోజనాలే బీజేపీ లక్ష్యం
● వామపక్ష పార్టీల మూడో ప్రత్యామ్నాయ ప్రయత్నాలు ఫలించ లేదు ● సీపీఐ జిల్లా మహా సభల్లో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల
మురళీనగర్: రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ వ్యవహరిస్తోందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు దుయ్యబట్టారు. విశాఖలోని మురళీనగర్‌లో ఆదివారం నిర్వహించిన పార్టీ జిల్లా మహాసభల్లో ఆయన పాల్గొని, మాట్లాడారు. మతాన్ని రాజకీయ ఆయుధంగా వాడుకుంటూ, రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల మధ్య చిచ్చుపెట్టి, తమ వైపు తిప్పుకొని బీజేపీ అధికారంలోకి వస్తోందని విమర్శించారు. 2014లో కాంగ్రెస్ అవినీతి, కుంభకోణాల వల్లే బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తెచ్చి ప్రజల ఖాతాల్లో రూ.15 లక్షలు చొప్పున వేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. వీటిలో ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. 2019లో రెండోసారి అనేక కుయుక్తులతో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. మూడో సారి 420 సీట్లు సొంతంగా గెలుస్తామని చెప్పి, నేరుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సీట్లు తెచ్చుకోలేకపోయిందన్నారు. యూపీఏ –1 ప్రభుత్వానికి వామపక్షాలు బయట నుంచి మద్దతిచ్చి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని సరైన రీతిలో నడిపేందుకు కృషి చేసిందని, వామపక్షాల వల్లే ఉపాధి హామీ వంటి పలు చట్టాలు వచ్చాయన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా మూడో ప్రత్యామ్నాయం కోసం వామపక్షాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదన్నారు. అధికారం కోసం రాజ్యాంగ సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేసిందని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలను రూపొందించుకుని ప్రజలతో మమేకమవడానికి పార్టీ కృషి చేయాలన్నారు. సీపీఐ సీనియర్ నాయకుడు పల్లెటి పోలయ్య పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. కె.వనజాక్షి, కె.సత్యనారాయణ, ఆర్.శ్రీనివాసరావు అధ్యక్ష వర్గంగా వ్యవహరించిన మహాసభలో పార్టీ సీనియర్ నాయకులు మానం ఆంజనేయులు, పి.దుర్గాభవాని, జేవీ సత్యనారాయణమూర్తి, ఏజే స్టాలిన్, డి.ఆదినారాయణ, సీహెచ్ రాఘవేంద్రరావు, జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు, జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన 162 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.