
సూపర్ బజార్ పై నుంచి పడి యువకుడి మృతి
అల్లిపురం: టర్నల్ చౌల్ట్రీ దరి సూపర్ బజార్ మేడ పై నుంచి పడి యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. టూటౌన్ సీఐ ఎర్రంనాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. సాలిపేటకు చెందిన రాజేష్ అనే వ్యక్తి సూపర్ బజారు మేడపై ఇండియన్ జిమ్ నిర్వహిస్తున్నాడు. భూపేష్‌నగర్ ప్రాంతానికి చెందిన రాజు (20) రాత్రి 8.30 గంటల ప్రాంతంలో జిమ్‌కు సంబంధించిన బ్యానర్‌ను కట్టేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో లైటింగ్ రాడ్డును పట్టుకోగా.. అది విరిగిపోవడంతో రెండో అంతస్తు పైనుంచి కిందపడిపోయాడు. దీంతో అతని తలకు తీవ్ర గాయం కాగా కేజీహెచ్‌కు తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సీఐ ఎర్రంనాయుడు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.