
కమనీయం వెంకన్న కల్యాణం
గోవిందనామస్మరణతో
మార్మోగిన బల్లిగిరి
అల్లిపురం: వైశాఖ శుద్ధ ఏకాదశి సందర్భంగా బల్లిగిరిలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వార్షిక కల్యాణో త్సవం గురువారం కన్నుల పండుగగా జరిగింది. పెళ్లి కుమార్తెలుగా ముస్తాబైన శ్రీదేవి, భూదేవిల నడుమ ముగ్ధ మనోహర రూపంలో వెలుగొందుతున్న శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణ వేడుకను తిలకించిన భక్తులు గోవిందనామ స్మరణతో పులకించిపోయారు. కల్యాణోత్సవాల్లో భాగంగా ఉదయం అంకురార్పణ, గరుడ పతాకాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేయ డం, విశేష హోమాలు ఆలయ అర్చకుడు గొడవర్తి రఘునాథాచార్యుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం స్వామివారి తిరుకల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారి తిరువీధి ఉత్సవం కన్నుల విందుగా సాగింది. దేవదాయ ధర్మాదాయ శాఖ తరఫున ఆలయ కార్యనిర్వహణాధికారిణి జీవీ రమాబాయి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు గొడవర్తి రఘునాథశర్మ పర్యవేక్షణలో ఆగమ పండితులు స్వామివారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. అధిక సంఖ్యలో జంటలు ఈ కళ్యాణోత్స వంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం దేవస్థానం వారు కల్యాణ దంపతులకు వేద పండితుల ఆశీర్వచనాలు, గౌరవ సత్కారాలు అందజేసి, స్వామివారి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.

కమనీయం వెంకన్న కల్యాణం