
వైభవ వేంకటేశ్వరుడి కల్యాణ వైభోగం
మురళీనగర్: కప్పరాడ ఎన్‌జీవోస్ కాలనీలో వెలసిన వైభవ వేంకటేశ్వర స్వామి 23వ వార్షిక కల్యాణోత్సవం గురువారం వైభవంగా జరిగింది. సాయంత్రం 5 గంటలకు స్వామి ఎదురు సన్నాహ ఉత్సవం నిర్వహించారు. అనంతరం ఉత్తర ద్వారం సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైదికపై వైభవుడిని కల్యాణమూర్తిగా ఆశీనులు గావించారు. భూదేవీ, శ్రీదేవీ సమేత వైభవుడి కల్యాణాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పెళ్లి పెద్దలుగా 32 మంది దంపతులు వేదికపై ఆశీనులు కాగా.. ఆలయ అర్చకులు వాసుదేవాచార్యులు, శేషాచార్యుల ఆధ్వర్యంలో కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వైభవ్ సిస్టర్స్ మాధురి, శిరీష అన్నమాచార్య కీర్తనలు ఆలపించారు. ఆలయ ఈవో బండారు ప్రసాద్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు వైభవుడికి లక్షమల్లెలతో అర్చన నిర్వహిస్తామని నిర్వాహకులు చెప్పారు.