నమ్మించి నట్టేట ముంచటం చంద్రబాబుకి అలవాటే..! | - | Sakshi
Sakshi News home page

నమ్మించి నట్టేట ముంచటం చంద్రబాబుకి అలవాటే..!

Apr 8 2024 1:30 AM | Updated on Apr 8 2024 10:37 AM

- - Sakshi

తగరపువలస: నమ్మించి నట్టేట ముంచడంలో చంద్రబాబుకు మించినోడు లేడని భీమిలి, నెల్లిమర్ల టీడీపీ నేతలు రగిలిపోతున్నారు. పక్క పక్కనే ఉన్న భీమిలి, నెల్లిమర్ల నియోజకవర్గాలకు చెందిన బీసీ కాపు(తూర్పు కాపు) ఇన్‌చార్జిలు కోరాడ రాజబాబు, కర్రోతు బంగార్రాజులను నాలుగున్నరేళ్లు పార్టీకి వినియోగించుకున్న చంద్రబాబు.. ఇప్పుడు నోట్ల కట్టలకు ఆశపడి వేరొకరికి టికెట్లు అమ్ముకున్నారని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇదిలాగే జరిగితే భవిష్యత్‌లో ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ కనుమరుగు కావడం ఖాయమని శాపనార్థాలు పెడుతున్నారు.

బంగార్రాజు, రాజబాబు ఒకవేళ తాయిలాలకు ఆశపడి తమ మనసులు మార్చుకున్నా.. తాము మాత్రం టీడీపీకి ఓటు వేసేది లేదని ఖరాఖండీగా చెబుతున్నారు. వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కసారి మాట ఇస్తే.. కచ్చితంగా న్యాయం చేస్తారని.. అదే చంద్రబాబు, లోకేష్‌ తరచూ మాటలు మార్చి.. చివరికి నోట్ల కట్టలున్నవారి వైపే మెగ్గు చూపుతున్నారని ఆరోపిస్తున్నారు. మెజారిటీ తూర్పు కాపులున్న చోట స్థానికులు కాని ఓసీకీ చెందిన లోకం మాధవికి(బ్రాహ్మణ–జనసేన), గంటా శ్రీనివాసరావు(బలిజ–టీడీపీ)లకు సీట్లు కేటాయించడంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.

టీడీపీలో న్యాయమెక్కడ?
వైఎస్సార్‌ సీపీని నమ్ముకున్న వారికి కచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఇందుకు ఉదాహరణే భీమిలి మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా పనిచేసిన అక్కరమాని విజయనిర్మలను భీమిలి, తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జిలుగా, వీఎంఆర్డీఏ చైర్‌పర్సన్‌గా అవకాశం ఇచ్చి గౌరవించింది. టీడీపీ నుంచి వచ్చిన మరో చైర్‌పర్సన్‌ కొప్పల ప్రభావతికి జీవీఎంసీ కో–ఆప్షన్‌ సభ్యురాలిగా అవకాశం ఇచ్చింది. పార్టీని నమ్ముకున్న నేతలకు ఎమ్మెల్సీలుగా, కార్పొరేషన్‌ చైర్మన్లుగా, డైరెక్టర్లుగా.. ఇలా అనే పదవుల్లో అవకాశం కల్పించిందని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇలాంటివి టీడీపీలో సామాన్యులకు జరగవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీలో నాయకత్వం కొరవడటం ద్వారా విలువే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదే భీమిలి మున్సిపాలిటీ నుంచి చైర్‌పర్సన్‌ పనిచేసిన గాడు చిన్ని కుమారి లక్ష్మికి చంద్రబాబు తొలుత ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటు ఇచ్చి.. తర్వాత అవమానించారు. ఆమెను రెండో వార్డు కార్పొరేటర్‌గా భీమిలి జోన్‌ ప్రజలు గెలిపిస్తే.. ఇప్పటి వరకు వార్డు ముఖమే చూడలేదు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఈ వార్డులో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు వందల కోట్లు ఖర్చు చేసింది. ఇప్పుడు గంటా భీమిలికి రావడంతో చిన్నికుమారి తమకు కనిపించిందని టీడీపీ నేతలే అంటున్నారు. గంటా అనుచరులు ప్రలోభాలకు గురి చేస్తూ మగవారికి కార్లు, మహిళలకు ద్విచక్ర వాహనాలు, రెండు సెంట్ల స్థలం ఇస్తామంటూ పార్టీలో చేరమని బలవంతం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

చంద్రబాబు, గంటాపై విమర్శలు
భీమిలి ఇన్‌చార్జిగా గత నెల 29వ తేదీ వరకు ఉన్న కోరాడ రాజబాబును కాదని విశాఖ ఉత్తరం నుంచి గంటా శ్రీనివాసరావును తీసుకురావడంపై టీడీపీ అభిమానులు మండిపడుతున్నారు. గంటా లాంటి నేతలు నాలుగేళ్లపాటు వ్యాపారాలు చేసుకుని.. చంద్రబాబు వేలం వేస్తే రూ.40 కోట్లు, రూ.60 కోట్లకు టికెట్‌ కొనుక్కున్నట్టే.. తాము కూడా నాలుగేళ్లు ఇంట్లోనే ఉండి వేలంలో టికెట్‌ కొనుక్కుంటామని రాజబాబు ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే. ఐదేళ్ల పాటు పార్టీ క్యాడర్‌ దిక్కులేనిది అయిపోయినా ఫర్వాలేదన్నారు.

ప్రత్యూష షిప్పింగ్‌ కంపెనీ పేరుతో గంటా కుటుంబ సభ్యులు రూ.390 కోట్లకు బ్యాంకుకు టోపీ వేశారన్నారు. ఉత్తర నియోజకవర్గంలో టీడీపీ కార్పొరేటర్‌ అభ్యర్థులకు సీట్లు అమ్ముకుని వారి ప్రచారానికి కూడా వెళ్లని గంటా.. ఇప్పుడు భీమిలి ప్రజలకు చేసేది ఏమీ ఉండదన్నారు. మంత్రి పదవి ఇచ్చిన చంద్రబాబు విశాఖకు వచ్చినా చివరకు లోకేష్‌ , భువనేశ్వరి వచ్చినా గంటా కన్నెత్తి చూడలేదన్నారు. ఓట్ల నాటకంలో భాగంగా గంటా ఇప్పుడు భీమిలి వచ్చారు తప్ప ఆయనకు సేవ చేసే ఉద్దేశం ఏమాత్రం లేదని రాజబాబు తేల్చి చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement