విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ క్రూరమైన చర్య | Sakshi
Sakshi News home page

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ క్రూరమైన చర్య

Published Tue, Apr 25 2023 12:36 AM

మాట్లాడుతున్న కేఏ పాల్‌  - Sakshi

కూర్మన్నపాలెం: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ క్రూరమైన చర్య అని, కార్మికులు లాభాల్లోకి తీసుకొచ్చిన సంస్థను అమ్మాలనుకోవడం మోదీ ప్రభుత్వ కుట్రలో భాగమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షడు కేఏ పాల్‌ అన్నారు. సోమవారం 802వ రోజు ఉక్కు రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించిన ఆయన కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తాను వస్తానని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకలు సమాచారమిచ్చినా పట్టుమని 100 మంది కూడా లేరని, ఇలా అయితే ఉద్యమాలు ఎలా చేస్తారన్నారు.

32 మంది అమరవీరుల త్యాగం, 16వేల మంది నిర్వాసితుల భూదానంతో ఏర్పడిన అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ ఉక్కు పరిశ్రమను విక్రయించాలని చూస్తే సహించమన్నారు. విశాఖ ఉక్కును అమ్మాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికే అమ్మాలని, అందుకోసం సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో చర్చిస్తానన్నారు. అవసరమైతే పీఎం మోడీ ఇల్లును ముట్టడించైనా ప్రైవేటీకరణను ఆపాలన్నారు. నరేంద్రమోడీ, అమిత్‌షాలు మాత్రమే పార్లమెంట్‌లో బిల్లు పెట్టి ప్రైవేటీకరణను ఆపగలరన్నారు. మే 15లోగా భారీ బహిరంగ సభను లక్ష మందితో ఏర్పాటు చేస్తే తాను వస్తానన్నారు. విశాఖ ఉక్కును ప్రభుత్వరంగ సంస్థగా కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

Advertisement
Advertisement