పరిగి: హక్కుల కోసం పోరాటం చేస్తుంటే సీఎం రేవంత్‌రెడ్డి అక్రమంగా అరెస్టులు చేయిస్తున్నారని, ఇలాంటి వాటికి భయపడేది లేదని భారత దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ అన్నారు. సోమవారం కొస్గి నుంచి కొడంగల్ వరకు పాదయాత్రగా వస్తున్న ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ.. దివ్యాంగుల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హామీలను అమలు చేయడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సమితి జిల్లా అధ్యక్షుడు సుధీర్ తదితరులు ఉన్నారు.
సఖి కేంద్రాన్ని
సందర్శించిన జడ్జి
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని సఖి కేంద్రాన్ని సోమవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి రాధిక సందర్శించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న వారితో మాట్లాడి పలు విషయాలపై ఆరా తీశారు. అంతకుముందు తెలంగాణ బాలుర గురుకుల కళాశాలలో జరిగిన నషా ముక్త్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమె వెంట న్యాయవాదులు శ్రీనివాస్, రాము తదితరులు ఉన్నారు.
అగ్నిమాపక శాఖ
జిల్లా కార్యవర్గం ఎన్నిక
అధ్యక్షుడిగా నాగేశ్వర్‌రెడ్డి
అనంతగిరి: అగ్నిమాపక శాఖ జిల్లా కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నాగేశ్వర్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా కే శ్రీనివాస్, సెక్రటరీగా ఎస్ చంద్రయ్య, ట్రెజరర్‌గా ఏ తిరుపతిరెడ్డి, సలహాదారుడుగా ఎన్ కృష్ణారెడ్డి ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం నూతన సభ్యులు డీఎఫ్‌ఓ పూర్ణచంద్రరావును మర్యాదపూర్వకంగా కలిశారు.
భక్తిశ్రద్ధలతో మహాపడి పూజ
దోమ: మండలంలోని గొడుగోనిపల్లిలో అయ్యప్ప మాలధారులు భక్తిశ్రద్ధలతో మహాపడి పూజ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ మల్లేశం, నాయకులు సద్దాం తదితరులు పాల్గొన్నారు.
ద్విచక్ర వాహనం అదుపుతప్పి..
ఇబ్రహీంపట్నం రూరల్: పనులు ముగించుకొని ఇంటికి తిరిగొస్తుండగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రమేష్ కథనం ప్రకారం.. తుర్కయంజాల్ ఏవీ నగర్‌కు చెందిన బట్టు రవి (35) డ్రైవర్‌గా పని చేస్తున్నా డు. ఈ నెల 21న ఉదయం విధులకు వెళ్లి ముగించుకొని సాయంత్రం బైక్‌పై తుర్కయంజాల్ నుంచి నాదర్‌గుల్ వైపు వస్తుండగా ఏవీ నగర్‌లోని వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలో అదుపుతప్పి కిందపడిపోయాడు. బలమైన గాయాలు కావడంతో స్పృహతప్పి పడిపోగా గమనించిన స్థానికులు అతడి జేబులోని ఆధార్‌కార్డు, గ్యాస్ బిల్లులో ఉన్న చిరునామా ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో 22న రాత్రి మృతి చెందాడు. భార్య మంగ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


