అనంతగిరి: జిల్లాలో ఖాళీగా ఉన్న 264 అంగన్‌వాడీ పోస్టులకు అర్హులైన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ దీపక్ తివారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహిళాశిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో 102 అంగన్‌వాడీ టీచర్లు, 162 కేంద్రాల్లో ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ప్రాజెక్టుల వారీగా కొడంగల్‌లో 13 టీచర్ పోస్టులు, 31 ఆయా పోస్టులు, మర్పల్లిలో 21 టీచర్, 14 ఆయా పోస్టులు, పరిగిలో 27 టీచర్, 78 ఆయా పోస్టులు, తాండూరులో 23 టీచర్, 28 ఆయా పోస్టులు, వికారాబాద్‌లో 18 టీచర్, 11 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. అర్హులైన మహిళలు అక్టోబర్ 10 నుంచి 24వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో దరఖాస్తు ప్రతితో పాటు అవసరమైన ధ్రువపత్రాల గెజిటెడ్ అధికారి ధ్రువీకరించిన జిరాక్స్ ప్రతులను సమర్పించాలని పేర్కొన్నారు. అర్హత, వయోపరిమితి, స్థానికత, రిజర్వేషన్లు, ఎంపిక విధానం తదితర వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించాలని కలెక్టర్ సూచించారు.
ఈవీఎం గోదాం పరిశీలన
వికారాబాద్ పట్టణంలోని ఈవీఎం గోదాంను శుక్రవారం కలెక్టర్ దీపక్ తివారి పరిశీలించారు. ఈవీఎంలు, బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, ఇతర సామగ్రిని తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటాచారి, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు నెమత్ అలీ, తహసీల్దార్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.


