పరిగి: పట్టణంలోని పలు కాలనీల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కనిపించిన వాళ్లపై దాడులు చేస్తున్నాయి. గురు, శుక్రవారాల్లో తిరుమల రెసిడెన్సీ కాలనీలో ఇద్దరు చిన్నారులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం కాలనీకి చెందిన శంకర్ కూతురు నైనిక ఉదయం పాఠశాలకు వెళ్లేందుకు బస్సు కోసం వేచి చూస్తోంది. ఒక్కసారిగా చిన్నారిపై కుక్కలు దాడి చేశాయి. దీంతో కేకలు వేసింది. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు వచ్చి వాటిని తరిమేశారు. అప్పటికే ముఖంపై దాడి చేశాయి. వెంటనే బాలికను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నగరానికి తరలించారు. గురువారం కూడా ఇదే కాలనీకి చెందిన ఓ విద్యార్థి ఆడుకుంటుండుగా కుక్క దాడి చేసిందని స్థానికులు తెలిపారు. కుక్కల బెడద ఎక్కువైందని చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపించారు. పిల్లలను బయటకు పంపాలంటే భయమేస్తోందని తెలిపారు.
చర్యలు తీసుకుంటాం
చిన్నారులపై కుక్కల దాడుల విషయం మా దృష్టికి వచ్చింది. వాటి నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే తమ సిబ్బంది కుక్కలను పట్టుకుంటోంది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. ఇప్పటికే 300 కుక్కలకు సంతాన నియంత్రణ శస్త్రచికిత్సలు చేశాం.
– రజిత, మున్సిపల్ చైర్మన్


