కష్టకాలం! | - | Sakshi
Sakshi News home page

కష్టకాలం!

Oct 6 2026 8:37 AM | Updated on Oct 6 2026 8:37 AM

ఆరుతడి మేలు ‘కంది’పోతోంది

మండుతున్న ఎండలు.. ఎండుతున్న పంటలు

జిల్లాలో ఇప్పటి వరకు 28 శాతం వరకు లోటు వర్షపాతం నమోదైంది. రాబోయే రబీలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి. ఎక్కువ నీటి వనరుల పంటలు తగ్గించుకోవాలి. ఆరుతడి పంటలు సాగు చేయడం మంచిది.

– మహిత, ఇన్‌ఛార్జ్‌ డీఏఓ

దిగుబడి పడిపోతుంది

కందిపంటకు ప్రస్తుతం ఒక భారీ వర్షం కావాలి. కానీ వర్షాకాలం దాటిపోయింది. ఎండలు విపరీతంగా మండుతున్నాయి. దీంతో కందులకు గొడ్డురోగం సోకుతుంది. కాలం బాగుంటే ఎకరాకు 5 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. ఇప్పుడు మూడు క్వింటాళ్లు వచ్చేలా లేదు. ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలి.

– దుశ్యంత్‌రెడ్డి, రైతు, ఎక్మాయి

కంది మొగ్గ, పూత దశలో ఉంది. తేమ లోపిస్తే పూత రాలిపోయి కాయధారణ తగ్గే ప్రమాదం ఉంది. ఇప్పటికే బెట్ట పరిస్థితి నెలకొనడంతో రైతులు వాన కోసం ఎదురుచూస్తున్నారు. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే దిగుబడి తగ్గుతుంది.

వానాకాలం దిగుబడులపై కర్షకుల ఆందోళన

సమృద్ధిగా కావాల్సిన సమయంలో అందని సాగునీరు

నెల రోజులుగా పత్తాలేని వాన

లోటు వర్షపాతంతో నిరాశ కలిగిస్తున్న భూగర్భ జలాలు

అరకొర విద్యుత్‌తో అన్నదాత అవస్థలు

బషీరాబాద్‌: పంట చేతికందే వేళ.. ప్రకృతి పగబట్టినట్లుగా మారింది. వాన కోసం ఎదురుచూస్తున్న పైర్లు ఎండల ధాటికి వాడిపోతుండగా.. రైతుల ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఖరీఫ్‌ సాగుకు చేసిన పెట్టుబడులు చేతికందేనా అనే ఆందోళన అన్నదాతలను వెంటాడుతోంది. పత్తి కాత దశలో ఎర్ర తెగులు ప్రభావం చూపుతుండగా.. పాలు పోసుకునే కీలక దశలో నీటి కొరత వరిని వేధిస్తోంది. పూత దశలో ఉన్న కంది తేమ కోసం ఎదురుచూస్తోంది. వర్షాభావానికి తోడు 37 డిగ్రీలకుపైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు పంటలకు కంటకంగా మారాయి. బోర్లు, బావులపై ఆధారపడిన రైతులకు అరకొర విద్యుత్‌ సరఫరా మరో సమస్యగా మారింది. జిల్లాలో కరువు ఛాయలతో 40 శాతానికి పైగా ఖరీప్‌ పంటలు చేతికందని పరిస్థితి నెలకొందని అధికారులు అంచనా వేస్తున్నారు.

5.53 లక్షల ఎకరాల్లో సాగు

జిల్లావ్యాప్తంగా 5,53,473 ఎకరాల్లో వానాకాలం పంటలు సాగయ్యాయి. ఇందులో వరి 3,19,361 ఎకరాలు, సోయాబీన్‌ 87,736, కంది 48,623, మొక్కజొన్న 47,237, పత్తి 45,864 ఎకరాల్లో ఉన్నాయి. పెసర 2,198, మినుము 1,853, చెరకు 558, పొద్దుతిరుగుడు 35, జొన్న 8 ఎకరాల్లో సాగైంది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీల కోసం ఇప్పటికే రైతులు భారీగా ఖర్చు చేశారు.

28 శాతం లోటు వర్షపాతం

పూత, కాత దశలో ఉన్న పంటలకు ప్రస్తుతం సమృద్ధిగా నీరు అవసరం. కానీ పలు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాకపోవడంతో భూగర్భ జలాలు ఆశించిన మేర లేవు.

జిల్లాలో ఇప్పటివరకు 423.5 మి.మీ. వర్షపాతం నమోదైంది.

సాధారణ వర్షపాతం 586.7 మి.మీ.తో పోలిస్తే 163.2 మి.మీ. లోటు ఉంది. = ఈలెక్కన సాధారణం కన్నా 28 శాతం తక్కువ వర్షం కురిసింది.

12 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది.

బంట్వారంలో అత్యధికంగా 62 శాతం లోటు ఉండగా.. బొంరాస్‌పేటలో సాధారణం కంటే 27 శాతం అధిక వర్షపాతం నమోదైంది.

ఎనిమిది మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

తెల్లబంగారానికి తెగులు

పత్తి ఆకులు ఎర్రగా, పసుపుగా మారి ముడుచుకుపోవడం, పూత, పిందె రాలడం, కాయలు ఎండిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.

జిల్లాలో ప్రాథమికంగా 800 ఎకరాల్లో ఎర్ర తెగులు వ్యాపించినట్లు వ్యవసాయశాఖ చెబుతోంది.

సాధారణంగా ఎకరాకు 12 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే ప్రాంతాల్లో ప్రస్తుతం 7 క్వింటాళ్లకు పడిపోయే పరిస్థితి ఉందని రైతులు చెబుతున్నారు.

వడలిపోతోన్న వరి

వరి పాలు పోసుకునే దశకు చేరింది. ఈ సమయంలో నీరు అందకపోతే గింజ నిండుదల తగ్గి దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

వర్షాధార పొలాల్లో తేమ తగ్గడంతో పైరు వడలిపోతోంది.

బోర్లు, బావులున్న రైతులు నీటిని అందించేందుకు ప్రయత్నిస్తున్నా.. విద్యుత్‌ సరఫరా అంతంతమాత్రంగా ఉండటంతో సాగునీరు కష్టంగా మారింది.

అరకొరగా విద్యుత్‌

అరకొర విద్యుత్‌ సరఫరాతో పంటలకు నీరందక ఎండిపోతున్నాయి.

కీలక దశలో ఉన్న చేలను దృష్టిలో ఉంచుకుని నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు.

ప్రస్తుత వర్షాభావ పరిస్థితి రబీ సాగుపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement