వికారాబాద్: మున్సిపాటీలో పారిశుద్ధ్య సమస్య రోజురోజుకు అధికమవుతోంది. సేకరించిన చెత్తను ఇష్టారాజ్యంగా శివారు ప్రాంతాల్లో డంపింగ్ చేస్తున్నారు. పట్టణంలోని చెత్త కుండీలను తొలగించడం, నిత్యం చెత్త సేకరించాల్సిన బండ్లు రాకపోవడంతో కాలనీలు కంపు కొడుతున్నాయి. కూడళ్ల వద్ద పారబోస్తున్న చెత్త డంపింగ్ యార్డును తలపిస్తోంది. మున్సిపాలిటీలోని అనుబంధ గ్రామాల పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తున్న అధికారులు సౌకర్యాల కల్పనలో పూర్తిగా విఫలమవుతున్నారనే ఆరోపణలున్నాయి. చెత్తను డంప్ చేస్తున్న పరిసర ఆవాసాల్లో నివసిస్తున్న ప్రజలు దుర్వాసన భరించలేక ఇబ్బంది పడుతున్నారు. దోమలు, ఈగల కారణంగా రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దోమల కారణంగా రాత్రివేళ నిద్ర పట్టడం లేదని చెబుతున్నారు.
ఎనభై వేల జనాభా
● వికారాబాద్ మున్సిపాటీలో 34 వార్డులు ఉండగా, 80 వేల జనాభా నివాసముంటోంది.
● నిత్యం సగటున 30– 35 మెట్రిక్ టన్నుల చెత్త సేకరిస్తున్నారు.
● సరిపడా సిబ్బంది లేకపోవడంతో చెత్త సేకరణ ప్రక్రియ సవ్యంగా సాగడం లేదు.
● చాలా కాలనీలకు చెత్త బండ్లు, ఆటోలు వెళ్లడం లేదు.
● తడి, పొడి చెత్తనంతా ఒకేచోట వేసి శివారు ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారు.
● కంపోస్టు ఎరువు తయారీ కేంద్రం మూతపడింది.
● ఉదయం వేళ మార్కెట్, రైతు బజార్ పరిసర ప్రాంతాల్లో చెత్త పారబోయటం ఎక్కువగా కనిపిస్తోంది.
● వికారాబాద్ నుంచి అనంతగిరి వెళ్లే దారిలోని మేకల మండిలో డంపిగ్ యార్డు కోసం పదెకరాల ఒకగుంట స్థలాన్ని కేటాయించారు.
● ప్రస్తుతం మున్సిపల్ పరిధిలో సేకరిస్తున్న చెత్తనంతా ఇక్కడే డంప్ చేస్తున్నారు.
● చెత్త సేకరణ తరలింపు కోసం 2 జేసీబీలు, 6 ట్రాక్టర్లు, 17 ఆటోలు వినియోగిస్తున్నారు.
● మరో 10– 15 వాహనాలతో పాటు యాభై మంది కార్మికులు అవసరమని పేర్కొంటున్నారు.
● 34 వార్డులలో 157 మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు.
వికారాబాద్‌లో కంపు కొడుతున్న కాలనీలు
రోజుల తరబడి ఎక్కడికక్కడే పేరుకుపోతున్న వ్యర్థాలు
దుర్వాసన, దోమలు, ఈగలతో స్థానికుల అవస్థలు
పట్టించుకోని మున్సిపల్ అధికారులు


