కొందుర్గు: పాత ఇంటిని కూల్చివేసిన మట్టిలో వెండి నాణేలు లభించినట్లు ప్రచారం కావడం కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కోమటి బుచ్చిలింగం ఇంటి స్థలాన్ని ఇదే గ్రామానికి చెందిన చిప్ప చంద్రశేఖర్ కొంత కాలం క్రితం కొనుగోలు చేశారు. మూడు రోజుల క్రితం ఆ స్థలంలో ఉన్న పాత మట్టిగోడలను జేసీబీ, ట్రాక్టర్ల సాయంతో తొలగించి గ్రామం వెలుపల పాత ఆంధ్రాబ్యాంక్ వెనుకాల ఉన్న ఖాళీ స్థలంలో మట్టిని పోయించారు. అక్కడ ఖాళీచేసిన మట్టిలో పాత ఇనుప వస్తువులు ఉన్నాయని కొందరు తీసుకునే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో ఓ వ్యక్తికి మట్టిలో వెండి నాణెం లభించినట్లు ప్రచారం జరిగింది. ఇది తెలిసిన గ్రామస్తులు అక్కడికి వెళ్లి మట్టిని తొలగించి వెతకడం మొదలు పెట్టారు. నాణెం ఫొటో శనివారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నాణెం నిజాంకాలం నాటిదని చర్చించుకుంటున్నారు. దీంతో రెవెన్యూ అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపారు.


