తాండూరు: పేదింటి ఆడబిడ్డల వివాహం తల్లిదండ్రులకు భారం కారాదనే ఉద్దేశంతో కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ప్రారంభించిన కల్యాణలక్ష్మి పథకం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్‌ఎస్ మహిళా నాయకులు శనివారం ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. తాండూరు మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ పట్లోళ్ల దీప నర్సింహులు ఆధ్వర్యంలో మహిళలు కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పథకం ద్వారా ఇప్పటి వరకు సుమారు 12.71 లక్షల కుటుంబాలకు రూ.11,130 కోట్ల ఆర్థిక సాయం అందిందన్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా లభించిందన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు నవీనా సంతోష్‌గౌడ్, సుప్రీత కరుణాకర్, నాగలక్ష్మి అనంత్‌రెడ్డి మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల సావిత్రి మహిళలు తదితరులు పాల్గొన్నారు.


