వెంకయ్యనాయుడికి సన్మానం
మొయినాబాద్‌రూరల్: భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. మేడిపల్లి రెవెన్యూ పరిధిలోని తన ఫామ్‌హౌస్‌కు శనివారం వెంకయ్యనాయుడు వచ్చిన విషయం తెలుసుకుని నాయకులతో కలిసి వెళ్లి సన్మానించారు. సన్మానించిన వారిలో పీఏసీఎస్ మాజీ చైర్మన్ యాదయ్య, మాజీ సర్పంచ్ నవీన్, ఎంపీటీసీ మాజీ సభ్యులు వెంకటేశ్, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఐ, కానిస్టేబుళ్లకు
ఉచిత శిక్షణ
బడంగ్‌పేట్: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్, ఎస్సీ డీడీ ఆధ్వర్యంలో నాదర్‌గుల్‌లో ఎస్‌ఐ, కానిస్టేబుళ్లకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్టు జిల్లా షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్‌మెంట్ డిప్యూటీ డైరెక్టర్ జె.రామారావు, గౌరవ డైరెక్టర్ బి.జనార్దన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులకు ఎస్‌ఐ, కానిస్టేబుళ్ల నియామక పరీక్షలకు ఉచిత శిక్షణ అందించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిపారు. ఉచిత శిక్షణతో పాటు హాస్టల్ సౌకర్యం ఉంటుందన్నారు. అభ్యర్థుల డిగ్రీ మార్కుల (మెరిట్) ఆధారంగా ఎంపిక జరుగుతుందన్నారు. ఆఫ్‌లైన్ దరఖాస్తు స్వీకరణ ఈ నెల 5 నుంచి 10వ తేదీ వరకు ఉంటుందన్నారు. 11న మెరిట్ లిస్ట్ ప్రదర్శన, 12 నుంచి శిక్షణ బ్యాచ్‌లు ప్రారంభిస్తామన్నారు. అభ్యర్థులు దరఖాస్తుతో పాటు 10వ తరగతి, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌కార్డు, రెండు పాస్‌పోర్ట్‌సైజ్ ఫొటోలు, ఎస్‌ఐ, కానిస్టేబుళ్లకు దరఖాస్తు చేసుకున్న ఫారం జిరాక్స్‌లు జతపరిచి బడంగ్‌పేట జీహెచ్‌ఎంసీలోని నాదర్‌గుల్‌లో (ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా, ఎస్సీ హాస్టల్ భవనం) నేరుగా సమర్పించాలని సూచించారు.
ధారూరు: వికారాబాద్ నుంచి తాండూరు వెళ్తున్న పాల వ్యాన్ అదుపు తప్పి రోడ్డు పక్క ఉన్న గుంతలోకి పల్టీ కొట్టింది. ఈ ఘటన ధారూరు సమీపంలోని మలుపులో శనివారం చోటుచేసుకుంది. డ్రైవర్ నర్సింహులుకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
సర్ ప్రక్రియ పూర్తి కావాలి
కొడంగల్: నియోజకవర్గంలో సర్ ప్రక్రియ ఈనెల 7వ తేదీ లోపు పూర్తి కావాలని కాంగ్రెస్ కొడంగల్ అసెంబ్లీ సర్ కన్వీనర్ మల్లేశ్ యాదవ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నోటీసులు అందిన వారు సమాధానం ఇవ్వాలని కోరారు. అర్హత కలిగిన వారు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్లు స్వాధీనం
కేశంపేట: అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న టిప్పర్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసిన సంఘటన మండల పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హెడ్ కానిస్టెబుల్ షేక్ సాజిద్ అలీ, కానిస్టేబుల్స్ బాలు, శివుడు పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తుండగా మండల పరిధిలోని సంగెం గ్రామం నుంచి షాద్‌నగర్ పట్టణం రోడ్డు దగ్గర రెండు టిప్పర్లు కన్పించాయి. వాటిని ఆపిన పోలీసులు అందులో ఒక్క టిప్పరు మట్టితో మరో టిప్పర్ ఖాళీగా ఉండటంతో మట్టి తరలింపునకు సంబంధించిన పర్మిషన్ వివరాలు తెలుసుకున్నారు. డ్రైవర్లు ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్నట్టు తెలపడంతో వాటిని స్టేషన్‌కు తరలించి హెడ్ కానిస్టేబుల్ షేక్ సాజిద్ అలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్‌హెచ్‌ఓ నరహరి తెలిపారు.