యాచారం: మొండిగౌరెల్లి అసైన్డ్ రైతులు శనివారం సాగర్ హైవేను దిగ్బంధించారు. గ్రామంలో భూసేకరణ చేపడుతున్న 19, 68 సర్వేనంబర్ల అసైన్డ్ రైతుల కబ్జా జాబితాను అధికారులు రెండు రోజుల క్రితం పంచాయతీ కార్యాలయం వద్ద ప్రకటించారు. ప్రకటించిన జాబితాలో పట్టాదారు, పాసుపుస్తకాల్లో ఉన్న ఎకరాల వివరాలు జాబితాలో రాకుండా తక్కువగా వచ్చాయి. దీంతో రైతులు పట్టాదారు, పాసుపుస్తకాల్లో ఉన్న అసైన్డ్ భూమికి మొత్తం పరిహారం చెల్లించాలని, కబ్జా రైతులకు కూడా చెల్లించే పరిహారంపై స్వష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మొదట యాచారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. స్పష్టమైన హామీ రాకపోవడంతో తహసీల్దార్ కార్యాలయం పక్కనే ఉన్న సాగర్ హైవేపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దాదాపు రెండు గంటల పాటు సర్కార్, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో సాగర్‌రోడ్డుపై ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు సంఘటనా స్థలానికి వచ్చి సమస్యను ఫోన్‌లో మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. డీసీపీ నారాయణరెడ్డి రైతులతో మాట్లాడి కలెక్టర్ నారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించి ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
● కబ్జా సర్వే రిపోర్టు తప్పుగా ఉందని ఆరోపణ
● సాగర్ హైవేపై బైఠాయించి ఆందోళన


