● గొంతుకోసి చంపిన దుండగులు
● యాంకి గ్రామంలో ఘటన
● కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
దౌల్తాబాద్: గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తి గొంతుకోసి దారుణంగా హత్యచేసిన సంఘటన మండల పరిధిలోని యాంకి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన బోడి బుజ్జప్ప(49) పదేళ్లుగా భార్య, ఇద్దరు కుమారులతో కలిసి నగరంలో కూలీ పనులు చేసుకుంటూ జీవించేవాడు. కొద్ది నెలలుగా భార్య, పిల్లలను అక్కడే వదిలేసి, స్వగ్రామంలో పనులు చేసుకుంటూ ఇక్కడే ఉంటున్నాడు. రోజూ మాదిరిగానే ఆదివారం కూలీ పని నిమిత్తం కోస్గి పట్టణానికి వెళ్లి, రాత్రి వేళ ఇంటికి చేరుకున్నాడు. సోమవారం ఉదయం బుజ్జప్ప బంధువు ఒకరు చనిపోయారు. ఈ విషయాన్ని అతనికి చెప్పేందుకు వెళ్లగా, హత్యకు గురై ఉండటాన్ని గమనించి నిర్ఘాంతపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కొడంగల్ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ వేణుకుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌తో చుట్టుపక్కల గాలించారు. విషయం తెలుసుకున్న మృతుడి భార్య, కుమారులు మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. మృతుడి కుమారుడు మాధవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని తెలిపారు.


