నీట్‌లో అక్కాచెల్లెళ్ల అరుదైన ఘనత
కేశంపేట: మండల పరిధిలోని ఇప్పలపల్లి గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు నీట్–2026లో అద్భుత ప్రతిభ కనబరిచారు. గ్రామానికి చెందిన కమ్మరి రమేశ్‌చారి, అనిత దంపతులకు కుమార్తెలు వైష్ణవి, రక్షిత. యాచారం మండలం కడ్తాల్ గురుకుల పాఠశాల, కళాశాలలో వారిద్దరిని ఇంటర్మీడియట్ వరకు చదివించారు. వారు నీట్‌లో మొదటి ప్రయత్నంలో విఫలం చెందారు. తల్లిదండ్రులకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇరువురికి హైదరాబాద్‌లో కోచింగ్ ఇప్పించారు. ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో అక్కాచెల్లెళ్లు 514 మార్కులను సాధించారు.
అదుపుతప్పిన డీసీఎం
కొత్తూరు: వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఓ డీసీఎం ట్రైలర్ లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటన శనివారం మున్సిపల్ పరిధిలోని తిమ్మాపూర్ శివారులో జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన క్రారం.. కొత్తూరు నుంచి శంషాబాద్ మార్గంలో ప్రయాణిస్తున్న ఓ డీసీఎం ముందు వెళ్తున్న ట్రైలర్ లారీని ఓవర్‌టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి వెనుక నుంచి ఢీకొట్టింది. అదే సయమంలో వెనుక నుంచి వస్తున్న కారు డీసీఎంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలవ్వలేదు. కాగా ప్రమాదం కారణంగా వాహనాలు రోడ్లపై నిలిచి రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
ఇబ్రహీంపట్నం: గుర్తు తెలియని మహిళా మృతదేహం ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో శనివారం లభ్యమైంది. స్థానిక ఎస్‌ఐ చందర్‌సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. చెరువులో సమారు 50 నుంచి 55 సంవత్సరాల వయసు గల మహిళా మృతదేహం ఉప్పరిగూడ(చేపలు పట్టే ప్రాంతం) వైపు కొట్టుకొచ్చింది. మృతదేహం ఉబ్బిపోయి ఉందని, ఆమె ఆచూకీ తెలియరాలేదని తెలిపారు. ఎవరైనా గుర్తిస్తే ఇబ్రహీంపట్నం ఎస్‌హెచ్‌ఓ 8712662361కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.


