కక్ష గట్టి.. కేసు పెట్టి | - | Sakshi
Sakshi News home page

కక్ష గట్టి.. కేసు పెట్టి

Jun 14 2026 10:19 AM | Updated on Jun 14 2026 10:19 AM

రోడ్డు ప్రమాదాన్ని.. హత్యాయత్నంగా మార్చారంటున్న బాధితులు రిమాండ్‌కు పంపడంతో ఉద్యోగం కోల్పోయిన యువకుడు పోలీసులే పెద్ద కేసు పెట్టారనిఫిర్యాదుదారుడి ఆవేదన ఎస్పీ స్పందించి బాధితుడికి న్యాయం చేయాలని వీడియో రిలీజ్‌

తాండూరు రూరల్‌: పది రోజుల క్రితం జరిగిన చిన్నపాటి రోడ్డు ప్రమాదాన్ని.. హత్యాయత్నం కేసుగా మార్చిన పెద్దేముల్‌ పోలీసుల పనితీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనుకోకుండా జరిగిన చిన్న యాక్సిడెంట్‌లో ఆస్పత్రి ఖర్చులు ఇప్పిస్తారనే ఉద్దేశంతో పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తే.. కొంతమంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఉద్దేశపూర్వకంగా పోలీసులే పెద్ద కేసులు నమోదు చేసి, ఓ యువకుడి జీవితాన్ని నాశనం చేశారని, జిల్లా ఎస్పీ స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఫిర్యాదుదారుడే ఓ వీడియో విడుదల చేయడం గమనార్హం.

ఏం జరిగిందంటే..

పెద్దేముల్‌ మండలం మంబాపూర్‌కు చెందిన మర్పల్లి శ్రీనివాస్‌, అనితారాణి దంపతుల కుమారుడు అనిర్వేష్‌(20) ఈనెల 2న తన స్కూటీపై గ్రామంలో పోస్టల్‌ ఉత్తరాలను బట్వాడా (పంపిణీ) చేస్తున్నాడు. ఈక్రమంలో స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద తన వాహనాన్ని స్లో చేశాడు. ఈ సమయంలో ఇదే ఊరికి చెందిన జాఫర్‌ తన భార్యతో కలిసి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ (బుల్లెట్‌)పై వెనక నుంచి వచ్చి సడెన్‌ బ్రేక్‌ వేయడంతో అదుపు తప్పి రెండు వాహనాలు పక్కనుంచి ఒకదానికొకటి తాకాయి. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న అనిర్వేష్‌తో పాటు బుల్లెట్‌ పైనున్న జాఫర్‌ కిందపడ్డారు. బుల్లెట్‌ బైక్‌ జాఫర్‌ పైన పడటంతో అతని ఎడమ చేతికి స్వల్ప ఫ్రాక్చర్‌ అయింది. ఈ ఘటనపై జాఫర్‌ అన్న మోయిజ్‌ అదే రోజు పెద్దేముల్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో అనిర్వేష్‌పై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి, ఈ నెల 8న రిమాండ్‌కు తరలించారు. దీంతో 9న ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిన బాధితడు ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయాడు.

ఫిర్యాదుదారుడి వీడియోతో కీలక మలుపు

తాము హత్యాయత్నం కింద పోలీసులకు ఎలాంటి కంప్లైంట్‌ చేయలేదని ఫిర్యాదుదారుడు మోయిజ్‌ శనివారం ఓ వీడియో విడుదల చేశాడు. తాము సాధారణ ప్రమాదమని మాత్రమే ఫిర్యాదు చేశామని, పోలీసులు దీన్ని పెద్ద కేసుగా మార్చేసి, చదువుకున్న యువకుడి జీవితాన్ని అంధకారంలోకి నెట్టారని వీడియోలో పేర్కొన్నాడు. జిల్లా ఎస్పీ స్నేహమెహ్ర స్పందించి అతనికి న్యాయం చేయాలని కోరాడు. మోయిజ్‌ విడుదల చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ఈ కేసుపై కొత్త చర్చ ప్రారంభమైంది. చిన్న ప్రమాదాన్ని హత్యాయత్నం కేసుగా నమోదు చేయడంతో పోలీసులపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే విషయమై ఓ పోలీసు అధికారి స్పందిస్తూ ఇంత పెద్ద కేసు పెట్టేది కాదని అభిప్రాయపడ్డారు.

నా కొడుకుకి న్యాయం చేయండి

ఇదిలా ఉండగా పెద్దేముల్‌ ఎస్‌ఐ ప్రశాంత్‌వర్ధన్‌ ఈ కేసులో అత్యుత్సాహం చూపడంతో పాటు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడరని, అతని చర్యతో తన కొడుకు జీవితం నాశనమైందని యువకుడి తల్లిదండ్రులు శ్రీనివాస్‌, అనితారాణి కన్నీటి పర్యంతమయ్యారు. తమ కొడుకుకు ఉద్యోగం రాకుండా అటెంప్ట్‌ టు మర్డర్‌ కేసులో ఇరికించిన ఎస్‌ఐపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్పీ స్నేహమోహ్రతో పాటు డీఐజీ, గవర్నర్‌కు స్పీడ్‌ పోస్టు ద్వారా ఫిర్యాదు చేసినట్లు మీడియాకు వెల్లడించారు. ఈ కేసుపై నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్‌లో పేర్కొన్నట్లు తెలిపారు.

ఫిర్యాదు మేరకే కేసు

మర్పల్లి అనిర్వేష్‌ అనే యువకుడు బైక్‌తో వెనక నుంచి ఢీకొట్టి చంపే ప్రయత్నం చేశాడని జాఫర్‌ సోదరుడు మోహిజ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి, హత్యాయత్నం కేసు నమోదు చేశాం. ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలున్నాయి. బాధితుల ఆరోపణలు అవాస్తవం

– ప్రశాంత్‌వర్ధన్‌, ఎస్‌ఐ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement