● రెండు ఎకరాలపట్టామార్పిడితో ఘర్షణ
● పరస్పర దాడులు, పోలీసులకు ఫిర్యాదు
● గొట్టిగఖుర్ధులో ఘటన
బషీరాబాద్: పచ్చని కుటుంబంలో భూ వివాదం చోటుచేసుకుంది. తల్లి పేరిట ఉన్న నాలుగు ఎకరాల భూమిలో రెండు ఎకరాలను కూతురు పేరుపై మార్చడం.. తల్లి, కొడుకు, కూతురు మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధి గొట్టిగఖుర్దు గ్రామానికి చెందిన నక్క మానెమ్మ, వెంకటప్ప దంపతులకు నలుగురు సంతానం. ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో వెంకటప్ప మృతి చెందాడు. పెద్ద కుమారుడు రాములు జీవన్గీ గ్రామానికి ఇల్లరికం వెళ్లగా, పెద్ద కుమార్తె వివాహం అయింది. చిన్న కుమారుడు చెన్నప్ప భార్య శివలీల, ముగ్గురు పిల్లలతో నగరంలో నివసిస్తున్నాడు. కుటుంబ సభ్యులంతా అప్పుడప్పుడు స్వగ్రామానికి వచ్చి వెళ్తుంటారు. ఈ క్రమంలో ఈ నెల 23న మానెమ్మ రెండు ఎకరాల భూమిని చిన్న కుమార్తె మంజుల పేరిట సెల్‌డీడ్ చేయించింది. విషయం తెలిసిన చెన్నప్ప ఈ నెల 29న గ్రామానికి వచ్చి తల్లిని ప్రశ్నించాడు. దీంతో కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాగా.. తల్లితో పాటు అక్క మంజుల తనపై దాడి చేసి చంపేందుకు ప్రయత్నించారని చెన్నప్ప.., చెన్నప్ప, అతని దాయాది నవీన్ కలిసి తనను, తన కుమార్తైపె దాడి చేశారని మానెమ్మ ఆదివారం బషీరాబాద్ పోలీసులకు పరస్పరం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఫిర్యాదు దారులు ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో ఆచితూచి విచారణ చేపడుతున్నారు.


