లారీ ఢీకొని బీటెక్‌ విద్యార్థి మృతి | - | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని బీటెక్‌ విద్యార్థి మృతి

Jun 1 2026 7:35 AM | Updated on Jun 1 2026 7:35 AM

లారీ ఢీకొని బీటెక్‌ విద్యార్థి మృతి

లంగర్‌హౌస్‌/షాద్‌నగర్‌రూరల్‌: స్నేహితుడితో సరాదాగా బయటకు వెళ్లిన ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థిని లారీ రూపంలో మృత్యువు కబళించింది. ద్విచక్ర వాహనాన్ని వెనక నుంచి వచ్చిన లారీ ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన లంగర్‌హౌస్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై రాంబాబు తెలిపిన మేరకు.. ఫరూఖ్‌నగర్‌ మండల పరిధిలోని ఎల్లికట్ట గ్రామానికి చెందిన బెంది శ్రీనివాస్‌ రెడ్డి ఏకై క కుమారుడు సృజన్‌ రెడ్డి(21) ఇబ్రహీంపట్నం వద్ద ఉన్న గురునానక్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చివరి సంవత్సరం చదువుకుంటూ బీఎన్‌ రెడ్డి నగర్‌లోని వసతి గృహంలో ఉంటున్నాడు. ఆదివారం ద్విచక్ర వాహనంపై మిత్రుడితో కలిసి హైటెక్‌ సిటీకి బయల్దేరాడు. టోలీచౌకి ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి వద్ద వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. కింద పడ్డ సృజన్‌ పై నుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వెనుక కూర్చున్న వంశీ రెడ్డికి సైతం తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని లారీని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఎలికట్టలో విషాదఛాయలు

రైతు కుటుంబానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి పాడి ఆవులను పోషిస్తూ ఇద్దరు పిల్లలను చదివిస్తున్నారు. మరో రెండు నెలల్లో కోచింగ్‌ పూర్తి చేసుకొని ఉద్యోగం సాధిస్తాడని ఆ తల్లిదండ్రులు కలలు కన్నారు. కానీ విధి మృత్యురూపంలో కొడుకును కబళించింది. సృజన్‌రెడ్డి మరణంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement