స్లిప్‌ రాక.. వివరాలు తెలియక | - | Sakshi
Sakshi News home page

స్లిప్‌ రాక.. వివరాలు తెలియక

Jun 1 2026 7:29 AM | Updated on Jun 1 2026 7:29 AM

స్లిప్‌ రాక.. వివరాలు తెలియక

జులై 1నుంచి వీబీ జీ రామ్‌జీ

యాప్‌లో వివరాలు

దౌల్తాబాద్‌: ఉపాధిహామీ పథకంలో అమలు అవుతున్న నూతన నిబంధనలు కూలీలకు ఇబ్బందిగా మారాయి. ఎంత పనిచేశామో, ఖాతాలో కూలీ డబ్బులు ఎంత జమయ్యాయో తెలిపే పే స్లిప్పుల పంపిణీ నిలిచిపోయింది. దీంతో వేతనం ఎంతవచ్చిందో తెలుసుకోవడం కష్టంగా మారిందని పలువురు పేర్కొంటున్నారు. చదువు రాదని, స్లిప్పులు ఉంటే మా పిల్లలకు చూపించి తెలుసుకునేవారని తెలిపారు. ఇటు స్లిప్పులు రాక.. అటు యాప్‌లపై అవగాహన లేక వివరాలు తెలుసుకోలేక పోతున్నామని, ఇలా అయితే దళారుల చేతిలో మోసపోయే ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నిరోజులు పనిచేశారు..

నాలుగేళ్ల క్రితం వరకు కూలీలకు పే స్లిప్‌లు ఇచ్చేవారు. పలు కారణాలు చూపుతూ ప్రస్తుతం పంపిణీ నిలిపివేశారు. స్లిప్‌లో కూలి పేరు, పని ప్రదేశం, ఎన్ని రోజులు పని చేశారు, రోజువారి వేతనం ఎంత తదితర వివరాలు వచ్చేవి. వంద రోజుల పని దినాలు పూర్తవడానికి ఇంకా ఎన్ని రోజులు మిగిలి ఉన్నాయనేది ఉండేది. ఏ పని ప్రదేశంలో ఎన్ని రోజులు పని చేశారు, ఎంత వేతనం వస్తుందో స్పష్టంగా పేర్కొనేది. ఇప్పుడు స్లిప్‌లు లేకపోవడంతో అలాంటి వివరాలు ఏవీ వారికి తెలవడం లేదు. తెలిస్తే ఒక వారం తక్కువ డబ్బులు పడినా.. తదుపరి వారం గరిష్టం వేతనం కోసం పనిచేసేందుకు ఆసక్తి చూపే అవకాశం ఉంటుంది.

నష్టపోయే అవకాశం

ఉపాధి పనులకు సంబంధించిన నిధులను పోస్టాఫీసు లేదా బ్యాంకు ఖాతాల ద్వారా చెల్లిస్తుంటారు. మండలంలో చాలా వరకు పోస్టాఫీసు ఖాతాల్లోనే జమవుతున్నాయి. కూలీలకు ఒకేసారి రెండు లేదా అంతకంటే ఎక్కువ వారాల పేమెంట్‌లు జమ చేస్తుంటారు. అయితే నిరక్షరాస్యులైనా కూలీలు అధికంగా ఉండడంతో ఖాతాల్లో ఎంత నగదు జమ అయిందో తెలుసుకోవడం కష్టంగా మారింది. గతంలో బీపీఎంలు నగదు విత్‌డ్రా సమయంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే చాలామంది మినీబ్యాంకులకు వెళ్తున్నారు. అక్కడ ఆధార్‌కార్డును తీసుకెళ్తే కొంతమంది ఎక్కువ నగదు జమ అయినా.. తక్కువ వచ్చిందని నగదు ఇస్తున్నారు. కాగా.. కూలీల వేతనాల వివరాలను జన్‌మన్‌ రేగా యాప్‌లో పొందుపరుస్తున్నారు. దీనిపై క్షేత్రస్థాయిలో కూలీలకు అవగాహన లేకపోవడంతో అంతగా ఉపయోగం లేదు.

ప్రస్తుతం ఉపాధి కూలీలకు పేస్లిప్‌లు ఇవ్వడం లేదు. వారి వేతన వివరాలను ఎప్పటికప్పుడు జన్‌మన్‌రేగా యాప్‌లో పొందుపరుస్తున్నాం. యాప్‌పై క్షేత్రస్థాయిలో మా సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. మండలంలో కూలీల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తున్నాం.

–అంజిలయ్య, ఏపీఓ, దౌల్తాబాద్‌

యాప్‌పై అవగాహన లేకఇబ్బంది పడుతున్న కూలీలు

పని, ఫలితం వివరాలు ఆన్‌లైన్‌లోనే

నిరక్షరాస్యులకు తప్పనితిప్పలు

2005 నుంచి అమలవుతున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో ప్రస్తుతం ఒక్కో కుటుంబానికి వంద రోజుల పని దినాలు కల్పిస్తున్నారు. ఈ ఏడాది జూలై 1నుంచి దీని స్థానంలో వీబీ జీ రామ్‌జీ (వికసిత్‌ భారత్‌ గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ ఆజీవిక మిషన్‌) చట్టాన్ని అమలు చేయనున్నారు. పని దినాల సంఖ్య 125 రోజులకు పెంచనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement