దౌల్తాబాద్: అవినీతిపరులు మీరంటే మీరేనని అధికార పార్టీ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ నాయకులు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. అభివృద్ధి పనుల్లో కమీషన్లు దండుకుంటున్నారని గులాబీ శ్రేణులు ఆరోపించగా.. నిరూపిస్తే దేనికై నా సిద్ధమంటూ కాంగ్రెస్ నాయకులు ఎదురుదాడికి దిగారు. మీ హయాంలోనే కమీషన్లు తీసుకున్నారని ప్రత్యారోపణలు చేశారు. తాడోపేడో తేల్చుకుందామంటూ మాటల యుద్ధానికి దిగుతున్నారు. వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.
తేల్చుకుందాం రండి..
మండల పరిధి పలు గ్రామాల్లో బీటీరోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం అంతారం సమీపంలో వేసిన రోడ్డు భారీ వర్షానికి కల్వర్టు వద్ద కొట్టుకుపోయింది. దీనికి జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మహిపాల్ వీడియోలు తీశారు. సీఎం రేవంత్‌రెడ్డి, సోదరుడు తిరుపతిరెడ్డి కమీషన్లు పుచ్చుకోవడంతోనే పనుల్లో నాణ్యత లోపించిందని ఆరోపిస్తూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. దీనిని కాంగ్రెస్ నాయకులు ఖండించారు. సీఎం కుటుంబం కమీషన్ తీసుకోలేదని, మీలాంటి నాయకులు మా పార్టీలో లేరని విమర్శించారు. ప్రతిగా బీఆర్‌ఎస్ నాయకుడు కోట్లమహిపాల్.. మాట్లాడుతూ.. పార్టీ అధినేత కేసీఆర్ తమకుసంస్కారం నేర్పించారన్నారు. మీలాగా వ్యక్తిగత విమర్శలు చేయమని చెబుతూనే.. తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో మండలంలో రాజకీయం వేడెక్కింది. ఆదివారం నిర్వహించిన సమావేశంలో యువజన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. తమ నాయకులు ఎక్కడ కమీషన్ తీసుకున్నారో..? మీ నాయకులు కమీషన్లు ఎక్కడ తీసుకున్నారో శివాజీ చౌరస్తాలో తేల్చుకుందాం రండని సవాల్ విసిరారు. కాగా.. ఇరు పార్టీల మధ్య జరుగుతున్నపంచాయితీ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. అసలు విషయం గురించి ఆరాతీశారు. ఇష్టానుసారంగా మాట్లాడుకోవద్దని, సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించినట్లు సమాచారం.
బీఆర్‌ఎస్– కాంగ్రెస్ నాయకుల మాటల యుద్ధం
తారా స్థాయికి పంచాయితీ


