పరిగి: మండల పరిధిలోని కాళ్లాపూర్, రాపోల్ భూ బాధితులు ఇరవై రోజులుగా రిలే దీక్షలు చేపట్టారు. వారిని పరామర్శించేందుకు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హారీశ్‌రావు పర్యటించించేందుకు సన్నద్ధమయ్యారు. ఇందుకు పోలీస్ పర్మిషన్ కోసం సర్పంచ్ పుల్లయ్య పలువురు భూబాధితులు సోమవారం రాత్రి ఠాణాకు వెళ్లారు. వారు ఎంతకూ తిరిగి రాకపోవడంతో అర్ధరాత్రి గ్రామస్తులు, భూబాధితులు పెద్ద సంఖ్యలో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. దీంతో పీఎస్ ఎదుట తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అనుమతి కోసం వచ్చిన వారిని పోలీస్ స్టేషన్ నిర్బందించడం ఎంత వరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా రైతులు గేట్లు తెరవాలంటూ ఆందోళనకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ నాయకులు వారికి మద్దతు తెలపడంతో ఆందోళన ముదిరింది. అనుమతి తమ పరిధిలో లేదని ఉన్నతాధికారులతో మాట్లాడాలని పోలీసులు నిరాకరించారు. రైతులను ఎలా నిర్బందిస్తారని రైతులు నిలదీశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కాళ్లాపూర్ సర్పంచ్ పులిందర్ తన పిల్లలతో కలిసి స్టేషన్‌లో నిరసన తెలిపారు. పోలీస్ స్టేషన్ ఎదుట కాళ్లాపూర్ గ్రామస్తులు రైతులను వదిలిపెట్టాలని ఎంత వేడుకున్నా పోలీసులు వదిలిపెట్టలేదు. దీంతో చేసేది ఏమి లేక రైతులు వెనుదిరిగారు. హరీశ్‌రావు పర్యటన నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి నుంచే ముందస్తు అరెస్టులు చేశారు.
మహేశ్‌రెడ్డికి మద్థతు తెలిపేందుకు..
ధారూరు: బీఆర్‌ఎస్ నేత, పరిగి మాజీ ఎంఎల్‌ఏ మహేశ్‌రెడ్డికి మద్ధతుగా వచ్చిన బీఆర్‌ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం మహేశ్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని ధారూరు ఠాణాకు తీసుకువచ్చారు. విషయం తెలసుకున్న బీఆర్‌ఎస్ మండల నాయకులు వేణుగోపాల్‌రెడ్డి, హఫీజ్, రహమతుల్లాఖాన్, జైపాల్‌రెడ్డి, రవినాయక్, బాల్‌రాజ్‌నాయక్, వెంకట్‌రాంరెడ్డి, లక్ష్మయ్య తదితరులు పీఎస్‌కు చేరుకున్నారు. సీఐ రఘురామ్, ఎస్‌ఐ రాఘవేందర్ మాజీ ఎంఎల్‌ఏ మహేశ్వర్‌రెడ్డిని అక్కడి నుంచి వెంటనే బంట్వారం పీఎస్‌కు తరలించారు. బీఆర్‌ఎస్ నాయకులను అక్కడే నిర్భందించి సాయంత్రం సొంత పూచికత్తుపై వదిలిపెట్టారు.
కాళ్లాపూర్ సర్పంచ్ కుటుంబాన్ని నిర్బంధించిన పోలీసులు
అర్ధరాత్రి పీఎస్ ఎదుట ఉద్రిక్తత


