దోమ: నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ఓ పంచాయతీ కార్యదర్శిని అధికారులు వెనకేసుకొస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. దోమ మండల పరిధిలోని రాకొండ సెక్రటరీ రవి గ్రామ సర్పంచ్‌కు తెలియకుండా 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,15,025, ఈజీఎస్ నిధులు రూ.1,20,000 వేలు పక్కదారి పట్టించారు. ఈవిషయమై అన్ని ఆధారాలతో సర్పంచ్ మశ్చేందర్‌రెడ్డి ఎంపీడీఓ గ్యామకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై విచారణ జరిపిన ఆయన ఉన్నతాధికారులకు నివేదిక అందజేసినా, ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో సర్పంచ్ గత నెల 25న డీపీఓను కలిసి ఫిర్యాదు చేసినా, అధికారుల్లో చలనం లేదు. ఇదిలా ఉండగా సదరు కార్యదర్శి ప్రతీ పనికి డబ్బులు వసూలు చేస్తారనే ఆరోపణలున్నాయి. తమ నాన్న పేరుపై ఉన్న ఇంటిని తన పేరుపై మ్యుటేషన్ చేసేందుకు రూ.8 వేలు తీసుకున్న సెక్రటరీ నాలుగు నెలలుగా పని చేయడంలేదని గ్రామస్తుడు బండి అశోక్ తెలిపారు.
అధికారిక వెబ్‌సైట్‌లో తప్పుడు సమాచారం..
కార్యదర్శి రవి మంగళవారం విధులకు డుమ్మా కొట్టాడు. అటు గ్రామ పంచాయతీకి రాకపోవడమే కాకుండా మండల కార్యాలయంలో సమావేశంలో ఉన్నట్లు అధికారిక వెబ్‌సైట్‌లో ఫొటో అప్‌లోడ్ చేశారు. కానీ అక్కడ ఎలాంటి మీటింగ్ నిర్వహించలేదు. ఈ విషయమై ఎంపీడీఓను వివరణ కోరగా సెక్రటరీ పనితీరుపై ఇప్పటికే నివేదిక పంపించామని, ఉన్నతాధికారుల ఆదేశం మేరకు చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ తెలిపారు.
రోజులు గడుస్తున్నా స్పందించని అధికారులు
విస్తుపోతున్న సర్పంచ్, గ్రామస్తులు


