● వేసవి దృష్ట్యా పిల్లల విషయంలో అప్రమత్తత
● బయటకు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే
దౌల్తాబాద్: వేసవి కాలం దృష్ట్యా పాఠశాలలకు ఈనెల 16వ తేదీ నుంచి ఒంటి పూట బడులు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం సెలవు కావడంతో పిల్లలు ఆటలాడేందుకు బయటకు వెళ్తుంటారు. ఒక్కోసారి ఆనందం వెన్నంటే విషాదాలు పొంచి ఉండే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించి పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒంటి పూట బడుల సమయంలో పిల్లలు సరదాలకు అలవాటు పడి తల్లిదండ్రులు వారించినా ఇంటి పట్టున ఉండేందుకు సుముఖత చూపరు. ఇంట్లో చెప్ప పెట్టకుండా సరదా కోసం బయటకు వెళ్లి ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఎక్కువ. వారిని ఓ కంట పెట్టాల్సిన అవసరం ఉంది.
సరదా మాటున ప్రమాదం
మధ్యాహ్నం పాఠశాలలకు సెలవు కావడంతో పిల్లలు సరదాగా బావుల్లో, చెరువుల్లో స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు నేర్చుకోవడానికి వెళ్తుంటారు. సరదా మాటున ప్రమాదం పొంచి ఉందనే విషయం తల్లిదండ్రులు గ్రహించాలి. ఈత నేర్చుకునే క్రమంలో బావులు, చెరువులు, కుంటలు వాగులు లోతును అంచనా వేయక అందులోకి దిగుతారు. తీరా దిగాక లోతు ఎక్కువగా ఉండడం, మట్టి పేరుకుపోయి ఉండడం తదితర కారణాల వల్ల చిన్నారులు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. తల్లిదండ్రులు పర్యవేక్షణలోనే ఈత నేర్చుకోవాలి. అలాగే ఎండలో తిరగడం వలన అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. వడదెబ్బకు గురవ్వడం జ్వరం వంటివి రావొచ్చు. కాబట్టి నీడ పట్టునే ఉండేలా చూడాలి. ద్విచక్రవాహనాలు, సైకిళ్లు అంటే పిల్లలకు ఇష్టం ఎక్కువ. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వాటిని నడుపుతూ రోడ్డెక్కితే ప్రమాదాల బారిన పడే అవకాశంంది. కాబట్టి వాటికి దూరంగా ఉంచాలి. అవసరమైతే పెద్దలు పక్కనే ఉంటి వాటిని నడపడం నేర్పాలి.
జాగ్రత్తలు తీసుకోండి
● ఒంటిపూట బడి వదలాగానే మధ్యాహ్నం వేళ పిల్లలకు అవసరమైతే తప్పా బయటకు పంపొద్దు.
● ఈ సమయంలో వీలును బట్టి తల్లిదండ్రులు తమ పిల్లలతో గడిపేందుకు అధిక సమయం కేటాయించాలి.
● ఇంటి పట్టున ఉండే పిల్లలకు వారి పని(హోంవర్క్)లో సహాయం చేయాలి.
● పాఠశాల నుంచి మధ్యాహ్నం ఇంటికి వచ్చాక చిన్నారులకు పుస్తక పఠనం అలవాటు చేయాలి. నీతి కథలు స్ఫూర్తిగాథలు చదివే విధంగా ప్రోత్సహించాలి.
● అవసరమైతే నీడ పట్టున ఆడుకునే ఆటలకు ప్రాధాన్యం చెప్పాలి. చదరంగం, క్యారమ్స్ వంటి ఆటలు ఆడేలా చూడాలి.


