పనిచేయించి.. ముంచి!
బషీరాబాద్: ‘ప్రజాపాలన’ ద్వారా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన రాష్ట్ర ప్రభుత్వం వాటిని కంప్యూటరీకరణ చేసిన డాటా ఎంట్రీ ఆపరేటర్లకు గౌరవ వేతనం ఇవ్వకుండా రిక్తహస్తం చూపెడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు హామీల పథకాలు పొందుటకు 2023 డిసెంబర్ 28 నుంచి పలు దఫాలుగా గ్రామ సభలు పెట్టి ప్రజల నుంచి అర్జీలు తీసుకుంది. ఈ దరఖాస్తులను కంప్యూటర్‌లో నిక్షిప్తం చేయడానికి ప్రభుత్వ ఆపరేటర్లు సరిపోకపోవడంతో ప్రైవేటు డాటాఎంట్రీ ఆపరేటర్లతో కంప్యూటరీకరణ చేయింది. ఇందులోభాగంగా జిల్లాలో సుమారు వెయ్యికి పైగా ప్రైవేటు ఆపరేటర్లు నవంబర్ 2024లో రాత్రింబవళ్లు శ్రమించి డాటాను ఎంట్రీ చేశారు. ఇందుకుగాను ఒక్కో దరఖాస్తు ఎంట్రీకి రూ.30 చెల్లిస్తామని అధికారుల చెప్పడంతో ఒక్కో ఆపరేటర్ 500 నుంచి వెయ్యి దరఖాస్తులు 15 రోజుల పాటు చేశారు. అయితే వీరికి రావాల్సిన గౌరవ వేతనం కోసం ఎంపీడీఓ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ప్రభుత్వం నుంచి బడ్జెట్ రాలేదని సాకులు చెబుతున్నారు. జిల్లాలో సుమారు నాలుగు లక్షలకు పైగా దరఖాస్తులు కంప్యూటర్‌లో నిక్షిప్తం చేసిన తమకు 15 నెలలు గడిచిన డబ్బులు చెల్లించడంలేదని ఆపరేటర్లు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ప్రజాపాలనలో వీరితో పాటు వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లులుగా పనిచేస్తే వారికి వెంటనే గౌరవ వేతనం అందజేసిన సర్కారు డాటాఎంట్రీ ఆపరేటర్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
డాటా ఎంట్రీ ఆపరేటర్లకు
సర్కార్ రిక్తహస్తం
ఏడాది గడిచినా
నేటికీ అందని గౌరవ వేతనం
జిల్లాలో వెయ్యికి పైగా ప్రైవేట్ ఆపరేటర్లు
ఆందోళనకు సిద్ధమవుతున్న బాధితులు
రూ.21 వేలు రావాలి
ఎంపీడీఓ కార్యాలయం అధికారులు ప్రజాపాలన దరఖాస్తులు ఎంట్రీ చేయాలని టార్గెట్ ఇచ్చి రాత్రింబవళ్లు పనిచేయించుకున్నారు. 15 రోజుల పాటు పనిచేసి 700 దరఖాస్తులు కంప్యూటర్‌లో ఎంట్రీ చేశా. రూ.21 వేల వేతనం రావాలి. అధికారుల చుటూ్‌ట్ తిరుగుతున్నా పట్టించు కోవడంలేదు.
– రాజశేఖర్, ఆపరేటర్, బషీరాబాద్
రాత్రి 3 వరకు పనిచేశా
ఒక్క ప్రజాపాలన దరఖాస్తు కంప్యూటర్‌లో ఎంట్రీ చేస్తే రూ.30 చెల్లిస్తామని అధికారులు చెబితే నిత్యం రాత్రి 3 గంటల వరకు పనిచేశా. 660 దరఖాస్తులు ఎంట్రీ చేస్తే రూ.19,800 వేతనం రావాలి. 15 నెలలు కావస్తున్నా ఇప్పటివరకు తమకు రావల్సిన డబ్బులు ఇవ్వడంలేదు. ప్రభుత్వం శ్రమదోపిడీ చేస్తుందని అనుకోలేదు.
– ప్రశాంత్, ఆపరేటర్, బషీరాబాద్
పనిచేయించి.. ముంచి!
పనిచేయించి.. ముంచి!


