శివాలయంలో ప్రత్యేక పూజలు
దుద్యాల్: మండల పరధిలోని హస్నాబాద్ గ్రామంలోని కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివస్వాముల మండల దీక్షలో భాగంగా ప్రత్యేకంగా అభిషేక కార్యక్రమం చేశారు. అనంతరం శివాష్టకం, బిల్వాష్టకం, అష్టోత్తర శాత నామాలు పఠించారు. ఈ కార్యక్రమంలో శివ స్వాములు శ్రీనివాస్, సంజీవ, అశోక్, మోహన్, అనిల్, భీమేశ్, ఆంజనేయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
గ్రామాభివృద్ధికి కృషి
తాండూరు రూరల్: అందరి సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని చెంగోల్ సర్పంచ్ మాల నర్సమ్మ అన్నారు. బుధవారం గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో ఆమె మాట్లాడారు. పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇస్తానన్నారు. తాగునీటిని వృథా చేయొద్దని చెప్పారు. 7,8వ వార్డులో తాగునీటి సమస్య పరిష్కారానికి బోరు వేయిస్తానని తెలిపారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. ఉప సర్పంచ్ అనిత, పంచాయతీ కార్యదర్శి అశోక్ పాల్గొన్నారు.
బీరువా విరగొట్టి రూ.మూడు లక్షలు చోరీ
అనంతగిరి: ఎవరూ లేని సమయంలో దుండగులు ఇంటి తాళాలు విరగొట్టి రూ.మూడు లక్షల నగదును దొంగలించిన సంఘటన వికారాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని మోతిబాగ్ కాలనీలోగల బాలకేంద్రం సమీపంలో దోమ మండలం మల్లెపల్లికి చెందిన ప్రభులింగం కొన్ని రోజులుగా ఇక్కడ ఉంటూ క్యాటరింగ్ బిజినెస్ చేస్తున్నారు. అయితే ఈనెల 9న ఆయన గుండెపోటుతో మృతి చెందగా కుటుంబీకులు స్వగ్రామానికి వెళ్లి వచ్చారు. కాగా సోమవారం కుటుంబీకులు దేవస్థానాల వద్ద నిద్ర చేయడానికి వెళ్లారు. మంగళవారం రాత్రి దుండగులు ఇంట్లోకి చొరబడి బీరువా తాళం విరగొట్టి అందులోని నగదు ఎత్తుకెళ్లారు. కాగా కుటుంబీకులు ఉదయం వచ్చి చూసే సరికి ఇంట్లో దొంగలు పడ్డారని గ్రహించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
ఆర్టీసీ బస్సుల్లో
ప్రయాణం సురక్షితం
తాండూరు టౌన్: ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం సురక్షితంగా కొనసాగుతుందని టీజీఎస్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీలత అన్నారు. బుధవారం తాండూరు బస్ డిపోలో నిర్వహించిన రోడ్డు భద్రతా మాసోత్సవాల కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రయాణికుల భద్రతే ఆర్టీసీ లక్ష్యమన్నారు. ప్రతి రోజు విధులకు హాజరయ్యే ముందు డ్రైవర్లకు డ్రంకెన్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య మాట్లాడుతూ మద్యం తాగి బస్సు నడిపి ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు తీసుకురాకూడదన్నారు. డ్రైవర్లను శాలువా, నగదుతో సత్కరించారు.
శివాలయంలో ప్రత్యేక పూజలు
శివాలయంలో ప్రత్యేక పూజలు


