ఇరకాటంలో ఎమ్మెల్యే!
చుట్టుముడుతున్న వివాదాలు
వికారాబాద్: స్వగ్రామంలో ఇరువర్గాల మధ్య చోటు చేసుకున్న వివాదం చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యను ఇరకాటంలో పడేసింది. సర్పంచ్ ఎన్నికల సమయంలో తలెత్తిన ఘర్షణ అంతర్గతంగా రగులుతూ కనుము రోజు రాత్రి బహిర్గతమయింది. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వర్గం.. గెలిచిన సర్పంచ్ వర్గం ఎమ్మెల్యే సమక్షంలోనే ఒకరికొకరు దుర్భాషలాడటం.. గొడవపడడం జరిగాయి. పోలీసులు చెదరగొట్టడంతో గొడవ అప్పటికప్పుడు సద్దుమణిగింది. శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే యాదయ్య స్వగ్రామమైన నవాబుపేట మండలం చించల్‌పేటలో రాజుకున్న వివాదానికి సంబంధించిన ఫిర్యాదు పోలీసులు, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ వరకు వెళ్లాయి. సోషల్ మీడియా వేదికగా ప్రతులు చక్కర్లు కొట్టాయి. దీంతో అయోమయస్థితిలో పడిన ఎమ్మెల్యే యాదయ్య శనివారం సాయంత్రం వికారాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సంజాయిషీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
గ్రామంలో మొదలై అసెంబ్లీ వరకు
ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఎమ్మెల్యే యాదయ్య స్వగ్రామం చించల్‌పేట అన్ రిజర్వ్ అయింది. దీంతో ఆయన ప్రధాన అనుచరులలో ఇద్దరు వ్యక్తులు సర్పంచ్ పదవికి పోటీ పడ్డారు. ఇందులో ఆయన సపోర్టు చేసిన వ్యక్తి కాకుండా మరో వ్యక్తి సర్పంచ్‌గా గెలుపొందారు. అయితే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే చెందిన ఇరు వర్గాల మధ్య పొడచూపిన మనస్పర్థలు చాపకింద నీరులా వ్యాపిస్తూ వచ్చాయి. చివరకు సంక్రాంతి పండగ సందర్భంలో ఒక్కసారిగా భగ్గుమన్నాయి. గొడవలో తనపై ఎమ్మెల్యే చేయి చేసుకున్నాడని ఆ గ్రామ ఉప సర్పంచ్ ఆరోపిస్తున్నారు. ఇదే విషయం ప్రస్తుత సర్పంచ్, ఉపసర్పంచ్ వర్గం నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం స్పీకర్‌కు సైతం ఎమ్మెల్యేపై కంప్లయింట్ చేశారు. దీంతో దిద్దుబాటు చర్యలుగా ఎమ్మెల్యే స్పందిస్తూ.. అందరూ తన వాళ్లేనని.. వివాదం పెద్దగా చేసేందుకు ఒకరు రెచ్చగొట్టడంతోనే స్పీకర్ వరకు విషయం వెళ్లిందని భీంభరత్‌పై పరోక్ష విమర్శలు చేశారు. త్వరలో అంతా సద్దుకుంటుందని పేర్కొన్నారు.
కాలె యాదయ్యపై ఫిర్యాదు చేసిన స్వగ్రామస్తులు
చించల్‌పేటలో వర్గ పోరుతో సతమతం
కనుమ రోజు బహిర్గతమైన విభేదాలు
చిన్న విషయాన్ని రెచ్చగొడుతున్నారని ఆరోపణ
స్పీకర్ వరకు చేరిన పంచాయితీ
గత ఐదారు నెలలుగా ఒకటి తరువాత మరొకటి వివాదాలు ఎమ్మెల్యే యాదయ్యను చుట్టు ముడుతున్నాయి. ఆయన బీఆర్‌ఎస్ బీఫాంపై గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హస్తం గూటిలో తలదాచుకున్న ఆయనకు స్థానిక ఎన్నికలతో పాటు పార్టీ ఫిరాయింపుల చట్టం ఇరకాటంలో పడేసింది. ఒకే సమయంలో స్పీకర్ నోటీసులు, విచారణ కొనసాగాయి. ఇటీవల నవాబుపేటలో జరిగిన బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశానికి ఆ పార్టీ నేతలు ఓ కుర్చీకి ఎమ్మెల్యే కాలె యాదయ్య అని పేరు రాసి స్టేజీపైకి రావాలంటూ ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ నిర్ణయం తీసుకుంటూ ఎమ్మెల్యే యాదయ్య కాంగ్రెస్‌లో చేరటానికి ఎలాంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పటంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మొదట ఎంపీపీ, జెడ్పీటీసీ, టీటీడీ బోర్డు సభ్యుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని కాలె యాదయ్య కొనసాగించారు. మొదటిసారి కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ బీంఫారంతో ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన తిరిగి హస్తం గూటికి చేరారు. తాను అభివృద్ధి కోసం సీఎంను కలిశానని.., కాంగ్రెస్‌లో చేరలేదని చెబుతూ వస్తున్నారు. అయితే అటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతలు.. ఇటు స్వపక్షమైన కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గ ఇన్‌చార్జి భీంభరత్ ఓ పక్క ఆయనకు ఇబ్బందులు కలిగించేందుకు పావులు కదుపుతుండడం గమనార్హం.


