ఉద్యమ కళాకారులను ఆదుకోవాలి
బొంరాస్‌పేట: తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలను చైతన్యపరిచిన కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్తూరు బాలు అన్నారు. ఈ మేరకు ఆదివారం మండల పరిధిలోని కొత్తూరులో మహనీయుల విగ్రహాల వద్ద ‘హలో కళాకారుడా.. చలో ఇందిరాపార్క్’ గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈనెల 20న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి కళాకారుల సంక్షేమం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కళాకారులు బల్‌రాం, శ్రీను, కేఎన్‌పీఎస్ అంజిలప్ప, లక్ష్మణ్, చిన్నయ్య, సాయిలు, మల్కప్ప, రామప్ప, ఆనందం రమేశ్, లాలప్ప తదితరులు పాల్గొన్నారు.
రేపు పోరు దీక్ష
తాండూరు టౌన్: తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద పోరు దీక్ష చేపట్టనున్నట్లు జిల్లా ఉద్యమ కళాకారుల ఐక్యవేదిక అధ్యక్ష, కార్యదర్శులు బాలు, కేశవులు ఆదివారం ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈమేరకు కళాకారులు వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో పాట పాడి, ఆట ఆడి, డప్పు కొట్టిన నిజమైన కళాకారులకు ప్రభుత్వాలు గుర్తించకపోవడం శోచనీయమన్నారు. ఈ మేరకు ఇందిరాపార్కు వద్ద పోరుదీక్షకు కళాకారులు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. జిల్లా ఉద్యమ కళాకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు బాలు, జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవులు, కమిటీ సభ్యులు మల్లేష్, వెంకటయ్య, కృష్ణప్ప, రాములు, రమేష్ తదితరులు పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొన్నారు.


