అందరి చూపు అభ్యర్థి వైపు
● వికారాబాద్ మున్సిపాలిటీలో జోరుగా చర్చ
● ఈసారి ఎస్సీ మహిళకు చైర్మన్ పీఠం
● అన్ని పార్టీల్లో మొదలైన వ్యూహాలు
అనంతగిరి: వికారాబాద్ మున్సిపాలిటీగా ఏర్పడిన నాటి నుంచి చైర్మన్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు కావడం ఇదే మొదటిసారి. దీంతో ఆయా పార్టీల్లో దళిత సామాజిక వర్గంలో ఉన్న పలువురు నాయకులు చైర్మన్ కోసం బరిలో దిగాలని శోచిస్తున్నారు. ఈసారి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పావులు కదుపుతున్నారు. కాగా వికారాబాద్ మున్సిపల్‌గా ఏర్పడిన నాటి నుంచి చైర్మన్లుగా దేవదాసు, సంజీవరావు(ఎస్సీ జనరల్), జయానర్సింగ్‌రావు(బీసీ మహిళ) వీరంతా ప్రత్యక్షంగా ఎన్నికయ్యారు. అనంతరం లంకా పుష్పలతారెడ్డి(జనరల్ మహిళ), విశ్వనాథం సత్యనారాయణ(జనరల్), చిగుళ్లపల్లి మంజుల రమేష్‌కుమార్(జనరల్ మహిళ) వీరంతా పరోక్ష పద్ధతిన చైర్మన్‌గా అయ్యారు. చాలా మంది ఈసారి జనరల్ లేదా బీసీకు రిజర్వు అవుతుందనే ఆశపడ్డారు. అందుకు భిన్నంగా రిజర్వేషన్ ఎస్సీ మహిళకు వచ్చింది. వికారాబాద్ జిల్లా కేంద్రంగా ఉండటంతో చైర్మన్ పోస్టుకు ప్రాధాన్యం పెరిగింది. అన్ని పార్టీల్లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన చైర్మన్ అభ్యర్థి ఎవరుంటే బాగుంటుందనే ఆలోచనలో పడ్డారు. వారం రోజుల్లో అభ్యర్థులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
తలకిందులైన వార్డుల రిజర్వేషన్లు
వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 34 వార్డుల్లో గతంలో ఉన్న రిజర్వేషన్‌లు ఈసారి మారడంతో.. తాజా మాజీలు వేరే చోట పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. టౌన్‌లో తప్పకుండా తమకంటూ అధికారం ఉండాలనుకునే నాయకులు తమకు అనుకూలమైన వార్డు ఏదైతే బాగుంటుందని లెక్కలు వేసుకుంటున్నారు. ఏ వార్డులోకి వెళ్లి పోటీ చేస్తే గెలవగలం అనే అంచనాల్లో తలమునకలయ్యారు. ఇందుకుగాను ఆ వార్డులకు చెందిన ప్రధాన నాయకులతో చర్చలు చేస్తున్నారు. వార్డుల రిజర్వేషన్ కావడంతో ప్రధానంగా టీ పాయింట్లు, హోటళ్లు, తదితర ప్రదేశాల్లో ఎక్కడ చూసిన ఇదే చర్చ జరుగుతుంది. వార్డుల్లో తమకు అనుకూలమైన రిజర్వేషన్ రావడంతో పలువురు ఆశావహులు టికెట్ కోసం పార్టీలోని పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.


