గడువు ముగిసి.. ఆశలు తెరిచి
దుద్యాల్: పోలేపల్లి ఎల్లమ్మ జాతర జిల్లా వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది. దుద్యాల్ మండల పరిధిలోని పోలేపల్లి గ్రామంలో నిర్వహించే ఈ ఉత్సవాలకు ఏటా లక్షల్లో భక్తులు తరలొచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ జాతరకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అందుకే దీన్ని స్థానికంగా మినీ మేడారంగా పిలుస్తారు. అంతటి ప్రాముఖ్యం ఉన్న ఈ ఆలయానికి ఇప్పటివరకు నిర్వహణ కమిటీ ఏర్పాటు చేయకపోవడం విడ్డూరంగా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం బాధ్యతల్లో ఉన్న కమిటీ పదవీకాలం పూర్తయి దాదాపు పది నెలలు గడుస్తున్నా అధికార యంత్రాంగంలో ఎలాంటి కదలికలు లేవు. వచ్చే నెల 5వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అప్పటిలోపు నూతన కమిటీ ఏర్పాటు చేస్తారా? ప్రస్తుత కార్యవర్గంతోనే జాతర నిర్వహిస్తారా? అనే సందిగ్ధం స్థానికుల్లో నెలకొంది.
రహస్య చర్చలు
గత కమిటీ పదవీకాలం పూర్తయి 10 నెలలు గడుస్తున్నా నూతన కార్యవర్గం ఏర్పాటు చేయకపోవడంతో విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. కొత్త కమిటీలో ఏర్పాటు చేయాలని, అందులో తమకే చైర్మన్ పదవి ఇవ్వాలని పలువురు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు అధిష్టానం పెద్దలను ప్రసన్నం చేసుకుంటున్నారు. వారికి అనుకూలంగా ఉన్న నాయకులతో రహస్యంగా చర్చలు జరుపుతున్నారు. మరి కాంగ్రెస్ అధి నాయకత్వం ఎవరికి అనుకూలంగా వ్యవహరిస్తుందో తేలాల్సి ఉంది.
పలువురి నేతల గురి!
ప్రస్తుతం నూతన కమిటీ ఏర్పాటులో భాగంగా పోలేపల్లి గ్రామానికి చెందిన పలువురు నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో కొనేళ్లుగా కొనసాగుతున్న పుర్ర పెంటయ్య ఎల్లమ్మ దేవాలయ చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. అలాగే మాజీ చైర్మన్లు జయరాములు, ముచ్చటి వెంకటేశ్‌లు సైతం మరోసారి చైర్మన్‌పై గురి పెట్టారు. అధిష్టానం సీనియర్ నాయకుడైన పెంటయ్య వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం అందుతోంది. కొత్త వ్యక్తులకు అవకాశం ఇస్తారా? లేక గతంలో పని చేసిన వారికి మరోసారి అవకాశం ఇస్తారా? అనే మీమాంస నెలకొంది.
పోలేపల్లి ఎల్లమ్మ ఆలయ నూతన కమిటీపై ఉత్కంఠ
ప్రస్తుత కార్యవర్గం పదవీకాలం పూర్తయి పది నెలలు గడుస్తున్న వైనం
చైర్మన్ పీఠానికి మొదలైన పైరవీలు
వచ్చే నెల 5 నుంచే జాతర ప్రారంభం


