మారుతున్న పరిగి రూపురేఖలు
పరిగి: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పరిగి రూపురేఖలు మారుతున్నాయని ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి అభివృద్ధితో పాటు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకంలో మహిళలకు పెద్దపీట వేస్తుందన్నారు. ప్రజా సంక్షేమం, మౌలిక వసతుల కల్పన, అభివృద్ధిని సమాంతరంగా అమలు చేస్తూ మహిళా సాధికారతకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. మహిళలు ఆర్థిక, సామాజిక స్వాలంబన దిశగా ప్రతి పథకంలో చోటు కల్పిస్తున్నట్లు చెప్పారు. పరిగి నలుమూలల నుంచి రేడియల్ రోడ్లు, రైల్వే లైన్లు, పరిశ్రమలు రానున్నాయని దీంతో ప్రజలకు ఉపాధితో పాటు అభివృద్ధి గణనీయంగా పెరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ రూ.ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని తమ చేతుల్లో పెట్టారని, అయినా సీఎం రేవంత్‌రెడ్డి వెనక్కు తగ్గకుండా సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా కృషి చేస్తున్నారన్నారు. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ అనిల్‌బాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, వైస్ చైర్మన్ అయూబ్, ఏబ్లాక్ అధ్యక్షుడు పార్ధసారథి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి


