30 శాతం జిల్లా అభివృద్ధికి కేటాయించాలి
మండలిలో చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి
చేవెళ్ల: రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా.. ఏ ముఖ్యమంత్రి వచ్చినా రంగారెడ్డి జిల్లాలో విలువైన ప్రభుత్వ భూములను అమ్ముతున్నా జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించటం లేదని మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మండలిలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంకోసం రంగారెడ్డి జిల్లా భూములు అమ్ముతున్నారని ఈ భూముల అమ్మకాల్లో వచ్చిన నిధుల్లో జిల్లా అభివృద్ధికి 30శాతం నిధులు ఇవ్వాలని కోరారు. ఈ జిల్లా ప్రజాప్రతినిధిగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా, రెండు సార్లు మంత్రిగా పనిచేసిన తనను, తనలాంటి జిల్లా నాయకులను ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారని.. వారికి సమాధానం చెప్పలేకపోతున్నామన్నారు. ప్రభుత్వం అమ్మకాలు చేపట్టగా వచ్చిన నిధి నుంచి జిల్లా అభివృద్ధికి 30 లేదంటే 20శాతం నిధులను ప్రత్యేకంగా కేటాయించాలని కోరారు. మండలిలో పీఎంఆర్ ప్రస్తావించిన అంశంపై పార్టీలకు అతీతంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పొలం గట్ల పంచాయితీ.. రైతుకు గాయాలు
దోమ: పొలం గట్ల పంచాయితీలో ఇద్దరు రైతులు ఘర్షణ పడగా ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన దోమ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ వసంత్ జాదవ్ వివరాల ప్రకారం.. మోత్కూర్ గ్రామ సమీపంలో చెంచుకాలనీకి చెందిన అంజిలయ్య(45), కృష్ణ(25) పొలాలు పక్కపక్కనే ఉన్నాయి. గట్ల విషయంలో ఇరువురూ గొడవపడి, పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో కృష్ణ తలకు గాయాలు కాగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
శంకర్‌పల్లి: ఓ గుర్తు తెలియని వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన మోకిల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వీరబాబు తెలిపిన వివరాలు.. జన్వాడ గ్రామ గేటు సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో గత ఐదు రోజుల నుంచి చలనం లేకుండా ఓ గుర్తు తెలియని వ్యక్తి(35)పడి ఉన్నాడు. గమనించిన స్థానికులు మంగళవారం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహన్ని పరిశీలించారు. ఎటువంటి ఆధారాలు లభించలేదు. వారం రోజుల క్రితం చనిపోయినట్లుగా, మద్యం తాగి ఫిట్స్ వచ్చి మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఘటనపై అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


