‘అక్షరమాల’తో విజ్ఞానం పెంచుకోవాలి
● 90 రోజుల ప్రణాళికను విజయవంతం చేద్దాం
● మెప్మా పీడీ రవికుమార్
తాండూరు: మహిళల్లో అక్షరాస్యత పెంచేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మకు అక్షర మాల కార్యక్రమం ద్వారా మహిళలు విజ్ఞానం పెంచుకోవాలని మెప్మా పీడీ రవికుమార్ సూచించారు. బుధవారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వయం సహాయక సంఘాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో నిరక్షరాస్యత లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ప్రధానంగా మహిళలకు చదవడం, రాయడం రావాలనే ఉద్దేశంతో అమ్మకు అక్షర మాల అనే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ చదవడం, రాయడం కోసం 90 రోజుల ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. అందుకోసం మెప్మా సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అక్షర వికాసం పేరుతో పుస్తకం రూపొందించినట్లు తెలిపారు. ఈ పుస్తకంలో 16 పాఠాలు ఉంటాయన్నారు. నిజ జీవితంలోని సంఘటనలను అవగాహన కలిగించడానికి సులువుగా అర్థం చేసుకోవడం కోసం అమ్మకు అక్షర మాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. నిరక్షరాస్యులైన మహిళలకు శిక్షణ కల్పించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. 15 ఏళ్లపైబడిన వారికి అక్షరాలు నేర్పిస్తామన్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత పరీక్షలు నిర్వహించి ధ్రువీకరణ పత్రాలు అందజేయన్నుట్లు పేర్కొన్నారు. అనంతరం మహిళలతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో వికారాబాద్ వయోజన విద్య అధికారి శ్రీనివాస్‌బాబు, తాండూరు ఎంఈఓ వెంకటయ్య, కో ఆర్డినేటర్ నటరాజ్, టీఎంసీ రాజేంద్రప్రసాద్, డీఆర్‌పీ హరీష్, సీఆర్పీ లావణ్య తదితరులు పాల్గొన్నారు.


