బాధ్యతగా పనిచేయండి
బషీరాబాద్: గ్రామాల అభివృద్ధికి పంచాయతీ కొత్త పాలకవర్గాలు బాధ్యతగా పనిచేయాలని, నిధులు ఇచ్చే బాధ్యత తనదని తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం బషీరాబాద్, కాశీంపూర్ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 22 నెలలుగా సర్పంచులు లేకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయని, త్వరలో విడుదల కానున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా కావడంతో తాండూరు నియోజకవర్గానికి అధిక నిధులు తెచ్చి పంచాయతీలకు కేటాయిస్తామన్నారు. బషీరా బాద్ మేజర్ పంచాయతీ అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇస్తామని పేర్కొన్నారు. పారిశుద్ధ్యం, పచ్చదనం, తాగునీటి వసతిపై సర్పంచులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. మరో మూడు నెలల్లో మరోసారి ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు మంజూరు కానున్నట్లు చెప్పారు. కాశీంపూర్‌నుఇందిరమ్మ పైలెట్ గ్రామంగా ఎంపిక చేశామనిఎమ్మెల్యే తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్, మార్కెట్ కమిటీ చైర్మన్లు మాధవరెడ్డి, బాల్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ వెంకట్‌రామ్‌రెడ్డి, సీనియర్ నాయకులు రాకేష్ మహరాజ్, రోహిత్ మహరాజ్, శంకర్‌రెడ్డి, కాలాల్ నర్సింలు, సుధాకర్‌రెడ్డి, ఖాలీద్, శ్రీనివాస్‌రెడ్డి, మాలే రాఘవేందర్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.


