
శరవేగంగా దుద్యాల్ అభివృద్ధి
రూ.300 కోట్లతో కొనసాగుతున్న పనులు రోడ్లు, అంగన్‌వాడీ కేంద్రాలు,సమీకృత భవనాలు కొత్త మండలం కావడంతో భారీగా నిధులు హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
దుద్యాల్: మండలంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కొత్త మండలం కావడంతో సొంత భవనాల కొరత ఏర్పడింది. రెవెన్యూ సేవ లు మినహా, ఇతర కార్యకలాపాలు పాత మండలాల్లోనే కొనసాగేవి. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం నుంచే ప్రాతినిథ్యం వహిస్తుండటంతో దుద్యాల్‌కు మహర్దశ పట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా నిధులు మంజూరయ్యాయి. ఏకంగా రూ.300 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రస్తుతం తాత్కాలిక భవనాల్లో తహసీల్దార్, ఎంపీడీవో, పోలీస్ స్టేషన్, వ్యవసాయ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. వీటన్నింటినీ ఒకే చోటనిర్మిస్తున్నారు. రూ.100 కోట్లతో రోడ్ల విస్థరణ పనులు జోరుగు సాగుతున్నాయి. దుద్యాల్‌లో రూ.8.5 కోట్లతో మండల సమీకృత భవన నిర్మాణాలు చేపట్టారు. పట్టణ పరిధిలోని మహబూబ్‌నగర్ – చించోళి జాతీయ రహదారి సమీపంలో రూ.3.5 కోట్లతో పోలీస్ స్టేషన్ భవన నిర్మాణం సాగుతోంది. అలాగే హకీంపేట్‌లో రూ.15 కోట్లతో సమీకృత పాఠశాల భవనం చేపట్టారు. మండల కేంద్రంలో రూ.45 కోట్లతో ఏటీసీ సెంటర్ నిర్మాణానికి ఇటీవల మంత్రి వివేక్ వెంకట్‌స్వామి భూమిపూజ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గౌరారంలో పల్లె దవాఖాన నిర్మా ణ పనులు సాగుతున్నాయి. వీటితోపాటు అంగన్‌వాడీ కేంద్రం, పాఠశాల భవన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. హకీంపేట్‌లో మహిళ శక్తి భవనం, ప్రభుత్వ పెట్రోల్ పంపు పనులు చేపట్టారు. దుద్యాల్ – లగచర్ల మధ్య ధాన్యం నిల్వ కో సం గోదాంలు నిర్మించనున్నారు. త్వరలో ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభం కానున్నాయి.
పారిశ్రామిక వాడ ఏర్పాటుతో..
మండలంలో పారిశ్రామిక వాడ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే భూ సేకరణ ప్రక్రియను దాదాపు పూర్తిచేశారు. లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి గ్రామాల పరిధిలో దాదాపు రూ.15 వేల కోట్ల వ్యయంతో పరిశ్రమలు నెలకొల్పనున్నట్లు అధికారి పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇది అందుబాటులోకి వస్తే వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి లభించే అవకాశం ఉంటుంది.