
చివరి మజిలీకి చిక్కులు
● అంత్యక్రియలు చేయాలంటే వాగు దాటాల్సిందే
● వరద నీటి నుంచే ట్రాక్టర్‌లో మృతదేహాన్ని తరలించిన గ్రామస్తులు
● పాలకులు సమస్య పరిష్కరించాలని డిమాండ్
మర్పల్లి: మండల పరిధిలోని సిరిపురంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు రెండు దశాబ్దాలుగా ఇబ్బంది పడుతున్నారు. వర్షాకాలంలో గ్రామస్తులు ఎవరైనా చనిపోతే వీరన్న వాగు మీదుగానే శ్మశాన వాటికకు వెళ్లాలి. ఇక్కడ వంతెన నిర్మించాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు విన్నవించినా పట్టించుకునే వారే కరువయ్యారు. శుక్రవారం రాత్రి గ్రామానికి చెందిన నిమ్మగల పెంటమ్మ(65) అనారోగ్యంతో మృతి చెందింది. శనివారం చితిపేర్చేందుకు వాగులో పారుతున్న వరద నుంచే ట్రాక్టర్‌లో కట్టెలు తీసుకెళ్లారు. ఎంతకూ వరద ఉధృతి తగ్గకపోవడంతో ట్రాక్టర్‌లో మృతదేహం ఉంచి వాగు మీదుగా తీసుకెళ్లారు. ఈ క్రమంలో ట్రాక్టర్ వరదలో చిక్కుకోవడంతో గ్రామస్తులంతా కలిసి నెట్టుకుంటూ వాగు దాటించి అంత్యక్రియలు నిర్వహించారు. ఇప్పటికై నా పాలకు స్పందించి వీరన్నవాగుపై వంతెన నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.