
అప్రమత్తంగా ఉండండి
అనంతగిరి/పరిగి: భారీ వర్షాల నేపథ్యంలో శుక్రవారం కలెక్టర్ ప్రతీక్‌జైన్, ఎస్పీ నారాయణరెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి అధికారులతో కలిసి టెలీకాన్ఫరెన్స్ ద్వారా అన్ని మండలాల అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లాలో ప్రమాదం జరిగే అవకాశం ఉన్న 50 వాగులు, బ్రిడ్జిలను గుర్తించి రెవెన్యూ, పోలీసులు కాపలా ఉండేలా ఏర్పాట్లు చేశారు. వర్షాలు తగ్గే వరకు ప్రజలు బయటకు రావద్దని సూచించారు. ఉధృతంగా ప్రవహించే వాగులు దాటొద్దని గ్రామాల్లో దండోరా వేయించాలని సూచించారు. ప్రమాదకరంగా ఉన్నచోట బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం ఎస్పీ నారాయణరెడ్డితో కలిసి పరిగి, వికారాబాద్ మున్సిపల్ పరిధిలో పొంగిపొర్లుతున్న వాగులు, వంకలను పరిశీలించారు. వాతావరణ శాఖ మన ప్రాంతాన్ని రెడ్ అలర్ట్‌గా ప్రకటించిందని పేర్కొన్నారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున పెద్ద పెద్ద భవనాల వద్ద, చెట్ల కింద ఉండరాదన్నారు. కలెక్టర్ వెంట వికారాబాద్, పరిగి మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, వెంకటయ్య తదితరులు ఉన్నారు.