
ట్రిపుల్‌ఆర్ బాధితులకు అండగా ఉంటాం
పూడూరు: ట్రిపుల్ ఆర్ భూ బాధితులకు అండగా ఉంటామని, సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం మండలంలోని రాకంచర్ల ఆలయ ప్రాంగణంలో భూములు కోల్పోతున్న పరిగి, వికారాబాద్, నవాబుపేట్, పూడూరు మండలాలకు చెందిన రైతులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి రైతుల సమస్యలు తెలియజేస్తానని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి ఆలోచించాలని కోరారు. ఈ విషయమై సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి నితిన్‌గడ్కారిని కలుస్తానని తెలిపారు. ట్రిపుల్ ఆర్ కారణంగా రైతులకు జరిగే నష్టాన్ని, రైతుల బాధలను అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడినట్లు చెప్పారు. పేద రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని కోరినట్లు తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డు కారణంగా ఎక్కువగా పేదల భూములు పోతున్నాయని, పాత అలైన్‌మెంట్ అమలు చేసేలా ఒత్తిడి తెస్తామన్నారు. పార్టీలకు అతీతంగా పోరాడితేనే సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. సమస్య తీవ్రత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిసేలా చేయాలని సూచించారు. అనంతరం బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ.. పెద్దల భూములను కాపాడటం కోసం పేదల కడుపుకొడతారా అని నిలదీశారు. ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్ ఎందుకు మార్చాల్సి వచ్చిందో ప్రజలకు వివరించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పేద రైతులకు న్యాయం జరిగేలా చూడాలని ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డిని కోరారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు భూనేటి కిరణ్‌కుమార్, శరత్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, నర్సింహారెడ్డి, మల్లేశం, తాజొద్దీన్, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.