
రిజర్వేషన్.. టెన్షన్
అప్పుల వేట..
యాచారం: స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సర్కార్ ఆదేశాల మేరకు అధికారులు వార్డు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లు దాదాపు ఖారారు చేసినట్లు తెలుస్తోంది. గోప్యత పాటించడంతో ఆశావహుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఎన్నికల్లో పోటీ చేయడం కోసం రెండు, మూడేళ్లుగా ప్రజల్లో ఉంటూ వివిధ సేవా కార్యక్రమాల పేరుతో రూ.లక్షల్లో ఖర్చు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ఆలోచనతో ఉండడంతో గ్రామ స్థాయిలో ఉండే పోటీదారుల్లో టెన్షన్ మొదలైంది. రిజర్వేషన్లు కలిసొస్తాయో.. లేదోనని ఆందోళన చెందుతున్నారు. మహానగరం చుట్టూ విస్తరించి ఉన్న జిల్లాలో ఏ గ్రామం నుంచి వార్డు సభ్యుడిగా, సర్పంచ్‌గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా గెలిపొందినా మంచి పలుకుబడి ఉంటుంది. ఫ్యూచర్‌సిటీతో యాచారం, కందుకూరు, కడ్తాల్, ఆమనగల్లు, మాడ్గుల, ఇబ్రహీంపట్నం, మంచాల మండలాల్లో క్రేజ్ ఏర్పడింది. స్థానిక ఎన్నికల్లో గెలుపొందితే తమ ఫ్యూచర్ కూడా మారుతుందని ఆశలపల్లకీలో ఉన్నారు.
ఇప్పటికిప్పుడు షెడ్యూల్ వస్తే..
రెండేళ్లుగా ఊరిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను త్వరలో నిర్వహిస్తామని సర్కార్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఆశావహుల్లో ఒకింత ఆందోళన.. మరోవైపు ఆశలు కంటికి కునుకు లేకుండా చేస్తున్నాయి. నేడో రేపో రిజర్వేషన్లు ప్రకటించి.. రెండు, మూడు రోజుల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ షెడ్యూల్.. ఆ వెంటనే పంచాయతీల షెడ్యూల్ ప్రకటించి ఎన్నికలు నిర్వహించాలని సర్కార్ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికిప్పుడు షెడ్యూల్ వస్తే పోటీలో ఉండడానికి కొందరు సై అంటుండగా.. మరికొందరు నై అంటున్నారు. యూరియా కొరత, పింఛన్ల పెంపు తరహా సమస్యలు అధికార పార్టీ నేతలను కలవర పెడుతుండగా, ప్రభుత్వ వ్యతిరేకత కలిసొస్తుందని బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు ఆశతో ఉన్నారు.
రిజర్వేషన్ ఏం వస్తుందో..
ఖర్చు ఎలా భరించాలో..
‘స్థానిక’ షెడ్యూల్‌పై ఎడతెగని ఉత్కంఠ
కలిసొస్తాయో.. లేదోనని ఆందోళన
పోటీ కోసం ఉవ్విళ్లూరుతున్న ఆశావహులు
ఇప్పటికే జనాన్ని ఆకర్షించేందుకు సేవా కార్యక్రమాలు
అప్పు చేసైనా ఖర్చు చేసేందుకు సిద్ధం!
రిజర్వేషన్లు కలిసొచ్చి.. పోటీ తట్టుకోవాలంటే దీటుగా ఖర్చు చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు. ఈ మేరకు పోటీకి ఉత్సాహం చూపుతున్న ఆశావహులు డబ్బుల వేటలో పడ్డారు. వడ్డీ వ్యాపారుల వద్దకు క్యూ కడుతున్నారు. కొందరు తమకున్న వ్యవసాయ భూములు, ప్లాట్లు, ఇతర ఆస్తులను అమ్మకానికి పెడుతున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు భారీగా ‘వడ్డి’ంపులకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, కడ్తాల్, ఆమనగల్లు, కందుకూరు, మాడ్గుల, తలకొండపల్లి, మహేశ్వరం, షాద్‌నగర్, చేవెళ్ల మండలాల్లోని పంచాయతీ, మండల పరిషత్‌లకు డిమాండ్ ఏర్పడింది. మరి రిజర్వేషన్లు ఎవరికి అనుకూలిస్తాయో.. ఎవరికి నిరుత్సాహం మిగులుస్తాయో వేచి చూడాలి.