
పశు వైద్యానికి చర్యలు
● తాండూరులో డాక్టర్లు అందుబాటులో ఉంటారు
● జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ సదానందం
తాండూరు రూరల్: మెరుగైన పశు వైద్యమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ సదానందం తెలిపారు. మంగళవారం తాండూరులోని ఏడీఏ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి నుంచి పట్టణంలో పశువైద్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు. యాలాల మండల వైద్యాధికారి శివదుర్గకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు చెప్పారు. ప్రతి రోజూ మధ్యాహ్నం ఆస్పత్రికి వస్తారని తెలిపారు. అలాగే వికారాబాద్ జిల్లా కార్యాలయంలో పని చేస్తున్న సిబ్బంది అశోక్ సోమ, మంగళ, బుధవారాల్లో, కుక్కింద సబ్ సెంటర్‌లో పని చేసే సైదులు గురు, శుక్ర, శనివారాల్లో అందుబాటులో ఉంటారని వివరించారు. జిల్లాలో 2.50 లక్షల ఆవులు, గేదెలు, ఎద్దులు, 4.50 లక్షల గొర్రెలు, మేకలు ఉన్నట్లు తెలిపారు. ఆస్పత్రుల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచామన్నారు. జిల్లాలో 33 మంది మండల పశువైద్యులకు గాను 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. 60 ప్యారామేట్ సిబ్బందికి గాను 25 పోస్టులు ఖాళీ పోస్టులు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం 10 క్వింటాళ్ల పశుగ్రాస విత్తనాలు ఉన్నాయని, 75 శాతం సబ్సిడీపై పాడి రైతులకు పంపిణీ చేస్తామని చెప్పారు. తాండూరులోని ఏడీఏ కార్యాలయం శిథిలావస్థకు చేరిందని, తాత్కాలికంగా మరో భవనం కేటాయించాలని సబ్ కలెక్టర్‌కు లేఖ రాసినట్లు తెలిపారు. నూతన భవనం కోసం కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపనున్నట్లు జిల్లా పశువైద్యాధికారికి సదానందం తెలిపారు.