
కొనసాగుతున్న హైవే విస్తరణ
వాహనాల రాకపోకలకు అంతరాయం
తాండూరు రూరల్: మండల పరిధి అల్లాపూర్ నుంచి కోత్లాపూర్ వరకు జాతీయ రహదారి విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా తాండూరు– చిందోళి మార్గంలోని ఐనెల్లి గ్రామ సమీపంలో ఉన్న వంతెనను సంబంధిత అధికారులు.. ఇటాచీ, జేసీబీ సహాయంతో తొలగింపు పనులు కొనసాగిస్తున్నారు. దీంతో ఐనెల్లి బిడ్జ్రికి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నిర్మాణ పనుల నేపథ్యంలో.. పక్కనే డైవర్షన్ రోడ్డును నిర్మించారు. తాండూరు నుంచి చించోళి వెళ్లే వాహనాలు.. ఆ మార్గం గుండా రాకపోకలు సాగిస్తున్నాయి.
హత్య కేసులో నిందితుడికి రిమాండ్
తాండూరు టౌన్: మహిళ హత్య కేసులో నిందితున్ని రిమాండ్‌కు తరలించామని పట్టణ సీఐ సంతోష్ కుమార్ సోమవారం తెలిపారు. పట్టణంలోని మల్లప్పమడిగ వద్ద ఆదివారం పట్టపగలు మాంసం విక్రయించే పిచ్చకుంట్ల పద్మమ్మ(60).. మేనల్లుడు వెంకటి చేతిలో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ మేరకు నిందితుడు హత్యకు ఉపయోగించిన గొడ్డలితో పాటు, మృతిరాలి మెడలో నుంచి అపహరించిన 4.2 తులాల బంగారు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై హత్యానేరం, దొంగతనం కేసు నమోదు, చేసి రిమాండ్‌కు తరలించారు.
దిగబడిన ట్రాక్టర్
కొడంగల్ రూరల్: తాండూర్ నుంచి కోస్గి వైపు ఫీటు రాయి లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్.. మండల పరిధి పర్సాపూర్ బస్టాఫ్ సమీపంలో సోమవారం మట్టిలో కూరుకుపోయింది. దీనిని రోడ్డు పనులు చేస్తున్న వారు గమనించి, ఇటాచీ సహాయంతో వాహనాన్ని వెలుపలకు తీశారు.
సబ్బండ వర్గాల అభ్యున్నతికి కృషి
కుల్కచర్ల: సబ్బండ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వ కృషి చేస్తుందని డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు ముదిరాజ్ అన్నారు. సోమవారం వడ్డెర సంఘం కుల్కచర్ల, చౌడాపూర్ మండలాల నాయకులు పలువురు.. వడ్డెర భవనం నిర్మించాలని కోరుతూ వారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. కులగణన చేసి, ఏ వర్గానికి ఎంతశాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న ప్రణాళికతో ఉందని పేర్కొన్నారు. శేఖర్, రాములు, కృష్ణయ్య, వెంకటయ్య, జనార్దన్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థికి పరామర్శ
తాండూరు టౌన్: చెట్టు కొమ్మ తలపై విరిగిపడి ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్థి సుశాంత్‌ను ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి సోమవారం నగరంలోని ఆస్పత్రిలో పరామర్శించారు. విద్యార్థి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. సుశాంత్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందుతుందని హామీ ఇచ్చారు. ఆయన వెంట నాయకులు గడ్డల రవీందర్, రాజేందర్, శివకుమార్ తదితరులు ఉన్నారు.

కొనసాగుతున్న హైవే విస్తరణ

కొనసాగుతున్న హైవే విస్తరణ

కొనసాగుతున్న హైవే విస్తరణ

కొనసాగుతున్న హైవే విస్తరణ